నడుం పూర్తిగా వంగిపోయిన స్థితిలో... రెండు చేతులను కాళ్లుగా చేసుకుని ఒక్కో అడుగు వేస్తున్న ఈ అమ్మ పేరు రాజమ్మ. వయస్సు 80 పైనే ఉంటుంది. వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండలో నివాసం ఉంటున్నారు. ఈమెకు ఒక్కగానొక్క కొడుకు మల్లేశం. తల్లంటే పంచప్రాణాలు. వీల్ ఛైర్ కొనే స్థోమత లేకపోవడంతో... బయటకు వెళ్లాలంటే ఇలా చిన్నపాటి బండిపై కూర్చోబెట్టి ఎంత దూరమైనా తీసుకువెళతాడు.
పింఛను డబ్బులు తీసుకోవాలంటే వీరిద్దరూ నానా యాతన పడాల్సి వస్తోంది. తల్లిని మేకలబండిపై కూర్చొబెట్టి... దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల వరకూ మల్లేశం తీసుకెళ్తున్నాడు... ఎక్కడ పింఛను ఇచ్చినా అక్కడకు ఇదే విధంగా తీసుకువెళతాడు. డబ్బులు తీసుకునేందుకు వచ్చేందుకు ఆరోగ్యం సహకరించడం లేదని.... ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ సొమ్ముతోనే పూట గడిచేది. గత్యంతరం లేక వారు వెళ్లక తప్పడంలేదు.
ఆస్తులిచ్చినా అమ్మానాన్నలను గెంటేసే బిడ్డలున్న ఈ రోజుల్లో.... కంటికి రెప్పలా కాపాడే కొడుకు ఉండడం నిజంగా రాజమ్మ అదృష్టమే. అలాగే నడవలేని స్ధితిలో ఉన్న వృద్ధులకు డబ్బులు తపాలా ద్వారానో... ఇంటికొచ్చి ఇవ్వడమో చేస్తే బాగుంటుంది.
ఇదీ చదవండి:లాక్డౌన్ బద్దకాన్ని వదిలించుకోండిలా...