వరంగల్ ఎనుమాముల మార్కెట్ పత్తి బస్తాలతో కళకళలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి రైతులు విక్రయించేందుకు భారీగా పత్తి బస్తాలు తీసుకొస్తున్నారు. దసరా పండుగ తరువాత పత్తి రాక మరింత పెరిగింది. గత రెండు రోజుల్లో 20 వేల బస్తాలకుపైగా పత్తి వచ్చింది. దసరా పండుగ ముందు క్వింటాకు 7 వేల 220 రూపాయలు ఉండే పత్తి ఇప్పుడు 7వేల 550 వరకు పలుకుతోంది.
ఆగం చేసిన వర్షాల..
ధర బాగున్నా పత్తి రైతు ముఖంలో ఆనందం లేకుండా పోతోంది. ఈసారి కురిసిన కుండపోత వర్షాలు రైతును ఆగం చేశాయి. ఎడతెరిపి లేని వానలతో రోజుల తరబడి చేలల్లో వర్షపు నీళ్లు నిండిపోవటంతో పూత కాత రాలిపోయింది. పత్తికాయలు కుళ్లిపోయాయి. ఫలితంగా దిగుబడి తగ్గిందని రైతు వాపోతున్నాడు. ఎకరాకు రెండు క్వింటాళ్లు రావడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇది చాలదన్నట్లుగా నాణ్యత లేని విత్తనాలు కూలీ ఖర్చులు, పురుగు మందుల ధరలు తడిసిమోపెడైయ్యాయి.ధర ఉన్నా లాభం రాక పత్తి రైతు అవస్థలు పడుతున్నాడు.
నాణ్యతా ప్రమాణాలతో..
దీపావళి నాటికి పత్తి రాక మరింత పెరుగుతుందన్న మార్కెట్ అధికారులు... గ్రేడింగ్ చేసి తీసుకురావాలని రైతులను కోరారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని... తడిసిన, తేమ ఉన్న పత్తిని బాగా ఉన్న పత్తిని కలిపి తీసుకువస్తే నష్టం వస్తుందని తెలిపారు. రెండు వేర్వరు చేసి తీసుకురావాలని సూచించారు. గతేడాది దిగుబడి ఉన్నా ధర లేక పత్తి రైతు నష్టపోతే... ఈసారి ధర ఉన్నా దిగుబడి లేక నష్టపోతున్నాడు.
ఇదీ చూడండి: