వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ సమావేశంలో మహిళా సర్పంచ్‌లు ఆందోళనకు దిగారు. గ్రామాల్లో జరుగుతోన్న అభివృద్ధి పనులకు ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలు అడ్డుపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి ఎదురవుతోన్న ఇబ్బందుల గురించి ఆయా సర్పంచ్‌లు.. జడ్పీటీసీ, ఎంపీడీవోల ఎదుట వాపోయారు.
లంచం అడుగుతున్నారు..
సొంత డబ్బులు ఖర్చు చేసి చేసిన పనులకు బిల్లులు (ఎంబీలు) చేయమంటే అధికారులు లంచాలు అడుగుతూ వేధిస్తున్నారని జమాల్ పురం సర్పంచ్ రేణుక, చోటపల్లి సర్పంచ్ రజిత, ఇస్లావత్ తండా సర్పంచ్ రమేశ్‌లు.. జడ్పీటీసీ, ఎంపీడీవోల ఎదుట వాపోయారు. అధికారుల తీరు పట్ల ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ముఖం చూపెట్టుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
గ్రామ పంచాయతీ నిధులు ఉన్నా.. అధికారులు ఖర్చు చేయడం లేదు. గ్రామాభివృద్ధికి ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు చేశాం. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కలెక్టర్ వెంటనే స్పందించి.. బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఆదుకోండి.
- బాధిత సర్పంచ్‌లు
గ్రామ సభలో మెజారిటీ తీర్మానం ఇచ్చిన అనంతరం.. ఓ పంచాయతీ సెక్రటరీ పనులను అడ్డుకోవడం సరికాదు. వారికి ఆ హక్కు లేదు. సెక్రటరీతో సంబంధం లేకుండా తీర్మానం చేసి.. పనులు జరపండి. త్వరలో సర్పంచ్‌లకు, పంచాయతీ కార్యదర్శులకు ఓ సమావేశం ఏర్పాటు చేస్తాం. తీర్మానాల అంశంలో ఏ ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- సింగులాల్, జడ్పీటీసీ
ఇదీ చదవండి: Suicide: పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం