వరంగల్ జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో కలుషిత ఆహార ఘటనపై జిల్లా కలెక్టర్ గోపి స్పందించారు. హాస్టల్ వార్డెన్ జ్యోతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంఛార్జ్ వార్డెన్‌గా స్వరూపను నియమించినట్లు తెలిపారు. అలాగే వంట చేసే ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగించినట్లు కలెక్టర్ గోపి పేర్కొన్నారు. వరంగల్ సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ రావు వసతి గృహన్ని తనిఖీ చేశారు. ఈ ఘటనపై హాస్టల్ సిబ్బందిని మందలించారు.
వార్డెన్ జ్యోతిని హాస్టల్ నుంచి వెళ్లొద్దంటూ అడ్డుకున్న విద్యార్థినులు: సస్పెషన్‌కు గురైన హాస్టల్ వార్డెన్ జ్యోతిని విద్యార్థినులు వెళ్లొద్దంటూ అడ్డుకున్నారు. మీ వల్లే మేము విద్యలో రానిస్తున్నామని .. మీరు లేని హాస్టల్ మాకొద్దు అంటూ వసతిగృహం ముందు ధర్నాకు దిగారు. మీతో పాటే మేము కూడా వెళ్తామంటూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. అవసరమైతే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని విద్యార్థినులు తెలిపారు.
చికిత్స పొందుతున్న విద్యార్థినులు క్షేమం: ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది విద్యార్థినులకు ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషతుల్యమైన ఆహారం తినడంతో తీవ్ర విరోచనాలతో ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్సను అందించామని తెలిపారు. ఇందుకు గల కారణాలేమిటో రిపోర్ట్‌లు వచ్చాక వెల్లడిస్తామని వైద్యులు చెప్పారు. తమ పిల్లల ఆరోగ్యం మెరుగుపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను వరంగల్ జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఉపేందర్ రావు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలను వసతి గృహాలను సందర్శించి నివేదిక తయారుచేసి జిల్లా కలెక్టర్‌కు అందిస్తామని చెప్పారు.
హాస్టల్ ముందు విద్యార్థినుల తల్లిదండ్రుల ధర్నా: ఈ ఘటనపై తల్లిదండ్రులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. కలుషిత ఆహారం కారణంగా 34 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురికాగా మిగిలిన విద్యార్థినులు భయాందోళనకు గురై తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి వద్దకు చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. చదువుకునేందుకు పంపించిన తమ పిల్లలను పట్టించుకునే నాధుడు లేరని వారు ఆరోపించారు. వసతి గృహంలో వసతులు, సిబ్బంది మెరుగుపరిచే వరకు తమ పిల్లలను పంపించమని తల్లిదండ్రులు స్పష్టం చేశారు.
అసలేెం జరిగిదంటే: గిరిజన బాలికల వసతి గృహంలో గత రాత్రి భోజనం చేస్తుండగా.. ఒకరి పళ్లెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని వర్ధన్నపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్.. విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్ వద్దకు చేరుకుని.. విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. కడుపు నొప్పి, వాంతులతో పరిస్ధితి అందోళనకరంగా ఉన్న 13 మంది విద్యార్థులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
ఇవీ చదవండి: బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత.. 13 మంది పరిస్థితి విషమం
'భారత్‌తో మాది అలాంటి స్నేహమే.. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం పక్కా'