వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ పరిధిలోని ఆర్ఎంపీ వైద్యుల తీరుపై 'వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు' పేరిట ఈటీవీ భారత్ కథనానికి జిల్లా వైద్యాధికారి స్పందించారు. మామిడిమాడ గ్రామపరిధిలోని నాలుగు తండాల్లో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు.
నాలుగు తండాల పరిధిలో 83 మంది మహిళల గర్భసంచిని తొలగించినట్లు గుర్తించారు. ఇందులో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు మహిళలు 20 మంది ఉన్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు తెలిపారు.
ఏం జరిగింది..
తండాల్లోని మహిళల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులు కాసులు కొల్లగొడుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా.. నొప్పులని వైద్యశాలకు వెళ్లినా.. గర్భసంచి తొలగిస్తే అన్ని సమస్యలు ఇట్టే పరిష్కారమైపోతాయని అపోహలు కల్పిస్తున్నారు. లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని తప్పుదోవ పట్టిస్తున్నారు. తండాల్లో కొందరు ఆర్‌ఎంపీలు తిష్ఠ వేసి మరి ఇదే పని మీద ఉంటున్నారు. వారి మాటలను నమ్మి.. గర్భసంచి తొలగింపుతో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి తెలియక చాలామంది మహిళలు శస్త్రచికిత్స చేయించుకొని నానా తంటాలు పడుతున్నారు.
అవగాహన కల్పిస్తాం..
ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు. తండాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. మహిళలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
ఇవీచూడండి: వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు