మున్సిపల్ పట్టణాలలో తక్షణమే కొత్త నర్సరీలను ఏర్పాటు చేయాలని వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే హౌసింగ్ బోర్డ్ కాలనీ, శ్రీనివాసపురంలో ఏర్పాటు చేసిన కొత్త నర్సరీల స్థలాలను ఆమె పరిశీలించారు. అంతకుముందు స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు.
మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీల్లో మొక్కలు పెంచేందుకు నర్సరీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినందున జిల్లాలోని అన్ని మున్సిపల్ ప్రాంతాల్లో కొత్త నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇందులో భాగంగానే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఎకరా 10 గుంటలలో, శ్రీనివాసపురంలో అర ఎకరాలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మున్సిపల్ పట్టణ ప్రాంతాలకు హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యంలో భాగంగానే ఈ నర్సరీలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.