రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని చిట్యాల రోడ్డులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. మొదటి దశలో నిర్మిస్తున్న ఇళ్ల వివరాల గురించి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలో తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించడమే కాకుండా... సీసీ రోడ్ల ఏర్పాటు, వాహనాలు నిలుపుటకు సదుపాయాలను కల్పించాలన్నారు.
అనంతరం చిట్యాల వద్ద నిర్మిస్తున్న ఆధునిక వ్యవసాయ మార్కెటు యార్డు నిర్మాణ పనులను పరిశీలించారు. యార్డులో నిర్మించే సిమెంటు రహదారులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడ పనులను త్వరగా పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. రైతులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించాలన్నారు. ఆర్డీవో అమరేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి స్వర్ణ సింగ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అలనాటి యాదగిరిగుట్ట.. నేటి నవ్య నిర్మాణాల యాదాద్రి