వనపర్తిలోని విత్తనాభివృద్ధి సంస్థ వానాకాలంలో సాగుకు వివిధ రకాల పంటలకు సంబంధించిన విత్తనాలను సిద్ధం చేసింది. గద్వాల, నారాయణపేట, రామన్‌పాడు, కొత్తకోట, నాగర్‌కర్నూల్, చిన్నచింతకుంట ప్రాంతాల్లోని రైతుల ద్వారా 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ విత్తనాలను ఉత్పత్తి చేయించినట్లు విత్తనాభివృద్ధి సంస్థ మేనేజరు బిక్షం తెలిపారు. ఎక్కడో ఉత్పత్తి చేసిన విత్తనాలు ఇక్కడికి తెచ్చి విక్రయిస్తే వాతావరణ పరిస్థితులు అనుకూలించక, నేల స్వభావంలో వ్యత్యాసాలు ఉండటంతో ఆశించిన స్థాయిలో దిగుబడిని ఇస్తాయన్న భరోసా లేకుండా పోయింది. దీనికితోడు నకిలీ బెడద ఎలాగూ ఉంది.
ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సొంత విత్తనోత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందులో భాగంగా ప్రారంభించిన వనపర్తి విత్తనాభివృద్ధి సంస్థ గతేడాది ఖరీఫ్, రబీల్లో రూ.70 కోట్ల విత్తనాలను విక్రయించింది. కొన్ని ప్రైవేటు సంస్థలు విక్రయించే విత్తనాలపై ఆధారపడటంతో రైతులకు ఎక్కువగా నష్టాలు వస్తున్నాయని పాలెం కృషి విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటరు ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సొంతంగా విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం ద్వారా పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయన్నారు. పాలెంలో విత్తనాలపై పరిశోధనలు జరిపి అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఉత్పత్తి చేసినట్లు కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు.