మహబూబ్ నగర్–హైదరాబాద్–రంగారెడ్డి ఎమ్మెల్సీ నియోజక వర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును గెలిపించేందుకు వామపక్షాల సభ్యులు, కార్యకర్తలు దసరా పండుగ రోజును పురస్కరించుకొని ప్రచారం చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ సన్నాహక సమావేశంలో కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతి కార్యకర్త పార్టీ తరపున స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని తమ్మినేని సూచించారు. ఒక్కో కార్యకర్త ప్రతిరోజు ఎంతమంది పట్టభద్రులను కలిసి వారి ఓటును అభ్యర్థిస్తారో వారి చరవాణి నెంబర్లతో సహా సాయంత్రానికి పార్టీ కార్యాలయానికి మెసేజ్ రూపంలో పంపించాలని సూచించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గెలుపు ఖాయమని కార్యకర్తలు విధిగా ప్రచారం కొనసాగిస్తే ఆయన గెలుపు ఎవరు అడ్డుకోలేరని తమ్మినేని పేర్కొన్నారు. సమయం తక్కువగా ఉన్నందువలన ఈ వారం రోజులు ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రచారంలో పాల్గొని నాగేశ్వరరావు గెలుపు కోసం కష్ట పడాలని కోరారు. ఎన్నో రాజకీయ పార్టీలు తనను వారి పార్టీలో చేరమని అభ్యర్థించిన న ఎలాంటి ముగ్గు చూపకుండా పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడేందుకే తాను కృషి చేస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు అని తమ్మినేని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదీచదవండి: వాగులో గల్లంతైనవారి మృతదేహాలు లభ్యం