ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కోడింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు, అమరచింత మండలాల్లో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని విద్యాశాఖ, ఐటీ శాఖలకు టిట సూచించింది. ఈ నేపథ్యంలో
రాష్ట్రంలోని 18 ప్రభుత్వ పాఠాశాలల నుంచి 52 మంది విద్యార్థులతో తెలంగాణ ఎర్లీ కోడర్స్ పేరుతో నిర్వహించిన శిక్షణా కార్యక్రమం విజయమంతం అయ్యింది. వీరికి జనవరి 6వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. పాఠశాలలోని 8, 9 వ తరగతికి చెందిన ఒక్కో విద్యార్థి, వారి టీచర్‌తో ఏర్పాటైన ఇన్నోవేషన్ క్లబ్ సభ్యులకు స్క్రాచ్, పైథాన్ ప్రోగ్రామింగ్‌పై శిక్షణ అందించారు.
రోజుకో శిక్షణ:
- 1వ రోజు: ప్రో-గేమ్ ప్రతినిధులు కంప్యూటర్ లేకుండా లెగో స్కిట్ ఆధారంగా ఎలా కోడింగ్ చేయాలో విద్యార్థులకు నేర్పించారు.
- 2, 3వ రోజులు: రోబో కాలం ప్రతినిధులు స్క్రాచ్ ప్రోగ్రాం గురించి శిక్షణ ఇచ్చారు.
- 4, 5 ,6 వ రోజులు: పైథాన్ లాంగ్వేజ్ పై వింగ్స్ ప్రతినిధులు శిక్షణ అందించారు.
అనంతరం వారికి ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేశారు. 25 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 40 శాతం కనీస ఉత్తీర్ణత శాతం కాగా 100% ఉత్తీర్ణత నమోదయింది. తద్వారా వీరంతా తెలంగాణ ఎర్లీ కోడర్స్ టీచర్లు, విద్యార్థులుగా గుర్తింపు పొందారు.
ఎక్కువగా గేమ్సే..!
టిటా అందించిన ఈ శిక్షణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటి వరకు కంప్యూటర్ ముట్టుకోని విద్యార్థులు సొంతంగా గేమ్స్ రూపొందించడం విశేషం. స్క్రాచ్ ప్రోగ్రాంలో భాగంగా ఆపిల్ అండ్ బాల్ గేమ్, రాకెట్ లాంచర్ గేమ్స్‌ని తామే రూపొందించి ఆడడం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతవరకూ చరవాణీలో గేమ్ డైన్లోడ్ చేసుకుని ఆడడమే తప్ప తమకు తామే ఓ గేమ్ రూపొందించి ఆడలేదని అన్నారు. పైథాన్ ప్రోగ్రామింగ్‌ని ఉపయోగిస్తూ క్యాలిక్యులేటర్ క్విజ్ గేమ్, డైస్ గేమ్స్‌ని కూడా రూపొందించామని హర్షం వ్యక్తం చేశారు.
పైలెట్ ప్రాజెక్ట్ శిక్షణను రిపోర్టు రూపంలో ఫిబ్రవరి 3వ తేదీన ప్రభుత్వానికి అందించనున్నామని ఈ కార్యక్రమ నిర్వాహకులు సందీప్ మక్తల తెలిపారు.
'టిట' ప్రయత్నాన్ని పలువురు ఎంఈవో, ప్రజాప్రతినిధులు ప్రశంసించారు. దీనిని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కోరారు.
ఇదీ చూడండి: భారీగా ఐఏఎస్‌ల బదిలీలు... కొత్త పోస్టింగ్‌లు ఇవే...