కరోనా వచ్చిన వారికి వైద్యం అందించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందని… వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మనోధైర్యమే అసలైన మందు అని అన్నారు. గురువారం వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానాలను సందర్శించి కొవిడ్ రోగులను పరామర్శించారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి కరోనా రోగులకు మనోధైర్యాన్ని కల్పించారు.
బాధితులకు మంత్రి భరోసా
కొవిడ్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాయన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకొని భౌతిక దూరం పాటించటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చని తెలిపారు. ఒకవేళ కొవిడ్ వచ్చినా వెంటనే వైద్యం తీసుకొని హోం ఐసోలేషన్‌లో ఉంటే త్వరగా బయట పడతారని వెల్లడించారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తుందని వివరించారు. వారికి అక్కడే మందుల కిట్ ఇస్తున్నట్లు తెలిపారు. అందువల్లే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయని చెప్పారు.
లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు
లాక్ డౌన్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దవాఖానాల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్‌లు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు చాలా బాగా పని చేస్తూ రోగులకు సేవలు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, దవాఖానా ఆర్‌ఎంవో చైతన్య గౌడ్, సూపరింటెండెంట్ హరీష్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్