రైతు వేదికల నిర్మాణాలను రెండు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలనాధికారితో కలిసి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రైతు వేదికలన్నింటిని వెంటనే ప్రారంభించాలని... ఒకవేళ ఇంకా ఎక్కడైనా ప్రారంభం కాని చోట తక్షణమే ప్రారంభించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ కొత్తగా 1500 అదనపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంజూరు చేశారని... వీటిలో 800 గ్రామీణ ప్రాంతానికి, 700 మున్సిపల్ పట్టణ ప్రాంతానికి మంజూరు చేశారని తెలిపారు. ఇందుకు స్థలాన్ని గుర్తించి తక్షణమే ప్రణాళిక రూపొందించాలన్నారు. వనపర్తి పట్టణంలో రహదారుల విస్తరణ సందర్భంగా ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
అప్పాయపల్లిలో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శ్రావణమాసం సందర్భంగా రానున్న 4, 5 రోజులలో వారు గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, శ్రీవాస్తవ, మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ ఛైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ మహేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.