పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి కేంద్రం సామాన్యుల నడ్డివిరుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. పట్టభద్రులు ఆలోచించి ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన.. తెరాస ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వనపర్తిలోని తన నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగిస్తే.. బడుగు, బలహీనవర్గాలు, పట్టభద్రుల పరిస్థితి ఏంటని మంత్రి ప్రశ్నించారు. 2014లో 10 శాతం ఉన్న వృద్ధిరేటు.. మోదీ అధికారంలోకి వచ్చాక 7 శాతానికి పడిపోయిందని ఆరోపించారు. మోదీ పాలనను తిరస్కరించడానికి ఈ ఒక్క కారణం చాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని పాలమూరు కోడలుగా ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఉద్యోగాలు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించేది తెరాస ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పట్టభద్రులు, ఉద్యోగులు విజ్ఞతతో తెరాస అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.