యువత జీవితంలో రాణించాలంటే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని... రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం... దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అపూర్వరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోనూ...
యువత అనవసరంగా సమయం వృథా చేసుకోవద్దని మంత్రి సూచించారు. స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత పోలీసు శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలోనూ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అనవసర విషయాలపై దృష్టి పెట్టకండి...
పోలీసు ఉద్యోగం ద్వారా ప్రజలకు మంచి సేవలు అందించే అవకాశం ఉందని... జిల్లా ఎస్పీ అపూర్వరావు పేర్కొన్నారు. శిక్షణతో కొత్త విషయాలపై అవగాహన పెంచుకుని ఉద్యోగాలను సాధించవచ్చని తెలిపారు. సామాజిక మాద్యమాలు ఇతర అనవసర వాటిపై దృష్టి సారించకుండా ఉద్యోగాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి...
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ధ్యేయంతోనే ఉచిత శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు... దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేలుకోవాలన్నారు.
ఇదీ చదవండి: విచ్చలవిడిగా పాత స్టాంప్ పేపర్ల దందా