వనపర్తి జిల్లా పరిధిలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న వ్యవసాయేతర భూములను గుర్తించి వాటి వివరాలను ఆన్లైన్ పొందుపరచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ ఛైర్మన్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుర్తించిన భూములకు సంబంధించిన వ్యక్తులకు మెరూన్ కలర్ పట్టాపాస్ పుస్తకాలను జారీ చేయాలన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించి భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా సర్వే నిర్వహించి ముందుకు వెళ్లాలన్నారు.
స్థిరాస్థుల రిజిస్ట్రేషన్‌పై ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టలేదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల్ల వెంకటేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. చెరువు శిఖం, ఎఫ్టీఎల్ ఆక్రమణలు, వక్సు, ప్రభుత్వ, దేవాదాయ, అటవీశాఖ, రైల్వే గుర్తింపు, సర్దుబాటులో దస్త్రాలను పక్కాగా నమోదు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. భూముల గుర్తింపు నమోదు కార్యక్రమంలో ఎలాంటి అనుమానాలు వచ్చినా ఒకటికి రెండు సార్లు సరిచూసుకుని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'పంటనష్టంపై సర్వే చేయించండి'