వనపర్తికి రూ.49.70 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఆయన నివాసంలో 53 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
నిధులను ఈ విధంగా కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు...
- నాలుగు వరుసల రహదారి విస్తరణ- రూ.22.50 కోట్లు
- జెర్రిపోతుల వాగు వద్ద బ్రిడ్జి- రూ.2 కోట్లు
- తాళ్లవాగు వద్ద బ్రిడ్జి- రూ.2.50 కోట్లు
- వనపర్తి - బుద్దారం రహదారి విస్తరణ- రూ.6.50 కోట్లు
- వనపర్తి - పెబ్బేరు రహదారి విస్తరణ- రూ.5.85 కోట్లు
- చింతల హనుమాన్ వద్ద నల్ల చెరువు బ్రిడ్జి నిర్మాణం- రూ.5.65 కోట్లు
క్రీడలతో శరీరం పరిపుష్టిగా ఉండడంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అన్నారు. క్రీడలు మనిషి దైనందిన జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సిల్వర్ జూబ్లీ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన వుడెన్ షటిల్ కోర్టును ఆయన ప్రారంభించారు. అనంతరం కాసేపు షటిల్ ఆడారు.
హాకీ క్రీడలకు వనపర్తి జిల్లా పెట్టింది పేరని... హాకీలో జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారని మంత్రి అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన షటిల్ కోర్టును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ