Lack of ambulances in Wanaparthy govt hospital : ప్రైవేటు అంబులెన్స్‌ల నిర్వాహకులు అడిగినంత చెల్లించలేక.. భుజాలపై, సైకిల్‌పై, బైక్‌పై కిలోమీటర్ల మేర శవాలను మోసుకెళ్లిన హృదయవిదారక ఘటనలు ఇప్పటివరకు మనం చాలానే చూశాం. శవాలనే కాదు.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించాలంటే.. తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు వనపర్తి జిల్లా దవాఖానాలో నెలకొన్నాయి.
సరిపడా సర్కారు అంబులెన్స్‌లు లేక.. రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు నిర్వాహకుల్ని ఆశ్రయిస్తే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని.. రాత్రి సమయాల్లో అయితే ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని రోగులు వాపోతున్నారు. ఆస్పత్రిలో ఉన్న రెండు అంబులెన్స్‌లు స్థానికంగా మాత్రమే.. అరకొరగా సేవలందిస్తున్నాయని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, కర్నూలు వెళ్లాలంటే ప్రైవేటు అంబులెన్స్‌లే దిక్కు అని రోగులు చెబుతున్నారు.
"మా అన్న కూతురుకు అత్యవసరంగా హైదరాబాద్ పెద్దాసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆసుపత్రిలో ప్రభుత్వ అంబులెన్స్‌లు లేవు. ప్రైవేట్ అంబులెన్స్‌లను అడిగితే విపరీతమైన ఛార్జీలు అడుగుతున్నారు. ఒకవేళ తెలిసిన వారిది ఎవరిదైనా తీసుకొద్దామంటే.. ఇక్కడి ప్రైవేట్ అంబులెన్స్ సంఘంగా ఏర్పడ్డారు. వాళ్లు ఒప్పుకోవడం లేదు." - నయీం, వనపర్తి నివాసి
వైద్య ఖర్చులకంటే.. అంబులెన్స్‌లకే ఎక్కువ డబ్బులవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. బయట నుంచి తెలిసిన వారిని తీసుకెళదామంటే.. ఆస్పత్రి దగ్గర ప్రైవేటు అంబులెన్స్‌ల నిర్వాహకులు సంఘం ఏర్పాటు చేసుకొని అడ్డుపడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక వారు అడిగినంత ముట్టజెప్పి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ప్రస్తుతం అసుపత్రిలో మొత్తం మూడు అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇవీ రోగులకు సేవలు అందిస్తున్నాయి. అసుపత్రికి కొత్త అంబులెన్స్‌లు వచ్చే అవకాశం ఉంది. మేము ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము." - డిప్యూటి సూపరింటెండెంట్, వనపర్తి ప్రభుత్వ అసుపత్రి
జిల్లా ఆస్పత్రిలో ఉన్న రెండు అంబులెన్స్‌ల నిర్వహణను.. అధికారులు గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల అవస్థలు ఇలా ఉంటే.. అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లు రోగులకు మెరుగైన సేవలందిస్తున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. తమ పరిస్థితిని అర్థం చేసుకొని అధికారం యంత్రాంగం సరిపడా అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చి.. ఆపదలో ఆదుకోవాలని రోగులు వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి :