KTR Wanaparthy Tour Updates : రాష్ట్ర ప్రజలు వరి ఒక్కటి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్ కూడా పండించాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ఎంచుకున్నామని తెలిపారు. వనపర్తి జిల్లాలోని సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రీయూనిక్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్‌పామ్ కర్మాగారానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
KTR on Oil Palm Cultivation Telangana : వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకుపోతుందని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆనాడు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. రైతులను కించపరిచే విధంగా మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. అందుకే రాష్ట్రంలో వరి మాత్రమే పండిస్తే సరిపోదని.. ఆయిల్‌పామ్ కూడా పండించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతులను ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఆయిల్ పామ్ పండించే రైతులకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని వివరించారు.
లక్షల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటున్నామని.. దిగుమతిని తగ్గించుకోవడానికి.. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నారని.. ఆయిల్ పామ్ రైతులకు ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ధాన్యం సేకరించినట్లు.. 14 కంపెనీలు పెట్టి ఆయిల్‌పామ్‌ను సేకరిస్తామని చెప్పారు. మరోవైపు మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ సాగు రైతులు ప్రీయూనిక్ కంపెనీకి అమ్ముకోవచ్చని వెల్లడించారు. పంట నష్టం కాకుండా రైతులను ప్రభుత్వమే ఆదుకుంటుందని కేటీఆర్ అన్నారు.