Amarachinta Cluster: ఆదరణ కోల్పోతున్న చేనేతరంగాన్ని రక్షించడం, ఉపాధి లేక వలస వెళ్తున్న నేత కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, తక్కువ ధరకు నాణ్యమైన చేనేత వస్త్రాలను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా వనపర్తి జిల్లా అమరచింతలో నెలకొల్పిన అమరచింత చేనేత క్లస్టర్ సత్ఫలితాలిస్తోంది. 2018లో అమరచింత చేనేత ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. కేంద్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, సంప్రదాయ పరిశ్రమల పునరుజ్జీవన పథకం కింద... 2020లో అమరచింత పట్టు చేనేత క్లస్టర్‌కు నిధులు మంజూరు చేసింది. ప్రాజెక్టు వ్యయం 2 కోట్లు కాగా కోటి 81 లక్షల రూపాయలు గ్రాంట్ కింద ఇచ్చింది.
నేతన్నలంతా కలిసి స్పెషల్ పర్పస్ వెహికిల్‌గా ఏర్పడి రూ.20.12 లక్షల వాటాధనం చెల్లించారు. సంస్థలో వాటాదారులుగా చేరిన చేనేత వృత్తిదారులు.. క్రమం తప్పకుండా పని, తద్వారా మెరుగైన ఆదాయాన్ని పొందుతున్నారు. క్లస్టర్ ఏర్పాటు తర్వాత అమరచింతతో పాటు తిప్పడంపల్లి, కొత్తకోట, గద్వాల, ఆరగిద్ద, కోటకొండ గ్రామాలకు చెందిన నేతన్నలు వాటాదారులుగా చేరారు. ఇంట్లో మగ్గాలున్న నేతన్నలకు అక్కడే పని కల్పిస్తున్నారు.
ఉపాధి, శిక్షణ..
క్లస్టర్‌లో చేనేత మగ్గాల ద్వారా 100 మందికి, రెడీమేడ్ దుస్తుల తయారీ ద్వారా 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చేనేత మగ్గాల శిక్షణ కేంద్రంతో పాటు రెడీమేడ్ దుస్తుల తయారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిజైనింగ్‌లోనూ 20 మంది యువతీ, యువకులకు ప్రత్యేకంగా శిక్షణ అందించారు. ప్రస్తుతం వారు డిజైనింగ్ విభాగంలో ఉపాధి పొందుతున్నారు.
రూ.50 లక్షల క్రయవిక్రయాలు..
అమరచింతలో తయారైన చీరలకు స్థానిక, బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. వ్యాపారులు ఇక్కడికే వచ్చి కొంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్, ముంబయి లాంటి ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 500 చీరలు ఉత్పత్తి చేస్తే 420 వరకూ అమ్మారు. 50 లక్షల రూపాయల వరకూ క్రయ విక్రయాలు జరిగాయి. వాటాదారులు పెరిగితే క్లసర్‌ను మరింత అభివృద్ధి చేస్తామని.. సంస్థ యాజమాన్యం చెబుతోంది.
నాటి కార్మికులు... నేడు యజమానులు
ఒకప్పుడు కార్మికులుగా పనిచేసిన నేతన్నలు.. ప్రస్తుతం క్లస్టర్‌కు యజమానులుగా మారారు. లాభాల్లోనూ వారికి వాటా దక్కనుంది. నేతల సమష్టి విజయానికి దోహదం చేసిన చేనేత క్లసర్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఇదీచూడండి: ఎల్‌ఐసీ పాలసీదారులా..? ఐపీవోలో పాల్గొనాలంటే ఏం చేయాలి?