Government B.tech College in Wanaparthy : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు కానుంది. వచ్చే విద్యా సంవత్సరం(2022-23) నుంచి తరగతులు ప్రారంభించేలా ప్రభుత్వం వనపర్తికి జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా ఈ నెల 3వ తేదీన జీఓ జారీ చేశారు.
అన్నింటికీ అనుకూలం..
Government Engineering College in Wanaparthy పాలమూరు జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేదా ఆర్‌జీయూకేటీ ప్రాంగణం ఏర్పాటు చేయాలని అప్పటి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. స్పందించిన సీఎం అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలంటూ అప్పటి విద్యామండలి ఛైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన 2018లో కమిటీని నియమించారు. ఆ కమిటీ 2018 ఏప్రిల్‌లో వనపర్తిలో పర్యటించింది. అన్నింటికీ అనుకూల ప్రాంతమని నివేదిక ఇచ్చింది.
రాదనుకున్నారు..
Wanaparthy Engineering College : ‘‘తాత్కాలికంగా అక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు నడపవచ్చు. శాశ్వత ప్రాంగణానికి అవసరమైన 250 ఎకరాల స్థలం కొత్త కలెక్టరేట్ పక్కన ఉంది. బాసర స్థాయిలో అభివృద్ధి చేయాలంటే రూ.700 కోట్ల నిధులు అవసరం’’ అని నివేదికలో పేర్కొంది. అప్పటి నుంచి ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోలేదు. కొద్ది నెలల క్రితం వనపర్తిలో వైద్య కళాశాల మంజూరైన నేపథ్యంలో ఇంజినీరింగ్ కళాశాల రాకపోవచ్చని అందరూ భావించారు.
ఇది ఐదో కళాశాల..
Wanaparthy Engineering College 2022 : తాజాగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరుచేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ ఆచార్య మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ, వర్సిటీకి హైదరాబాద్ కాకుండా ఇతర జిల్లాలో నాలుగు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయని, వనపర్తిలో అయిదోది ఏర్పాటు కాబోతోందని తెలిపారు.
విద్యా హబ్‌గా వనపర్తి: నిరంజన్‌రెడ్డి
వనపర్తిలో వైద్య కళాశాల, మత్స్య కళాశాల ఇప్పటికే మంజూరయ్యాయని తాజాగా ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుతో వనపర్తి విద్యాహబ్‌గా మారనుందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ తెలంగాణలో మొదలుకానున్న తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల అని వెల్లడించారు. మత్స్య, మెడికల్ కాలేజీలకు తోడు ఇంజినీరింగ్ కళాశాల రావడం పట్ల వనపర్తి ప్రజలు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.