Edulapuram Reservoir Nirvasithulu: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలో నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్ నిర్మాణంలో కొంకలపల్లి, బండరావిపాకుల గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. గ్రామాలను వదిలి వెళ్లలేమని అధికారులకు స్థానికులు మొరపెట్టుకున్నా.. రిజర్వాయర్ నిర్మాణం చేపట్టక తప్పదని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సుమారు 1300 కుటుంబాలు ఉండగా.. అందరికీ ఇల్లు కట్టించి.. భూములకు సంబంధించిన పరిహారం చెల్లిస్తామని చెప్పి గ్రామాలను ఖాళీ చేయించారు. గ్రామస్థుల కోసం తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంతో నిర్వాసితులు.. తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఏడాదైనా నివాసం లేదు..
Edulapuram Reservoir Issue : సొంత ఇళ్లను వదిలేసి ఏడాదికిపైగా అయ్యిందని.. ఇప్పటికీ పునరావాస చర్యలు చేపట్టడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు.. లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాత్రిళ్లు రేకుల షెడ్డులోకి పాములు వస్తున్నాయని, దినదినగండంగా జీవితం గడుపుతున్నామని తెలిపారు. తాతల కాలం నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఇల్లు, పొలాలు రిజర్వాయర్‌లో మునిగిపోవడంతో దిక్కులేనివారిగా మిగిలిపోయామన్నారు. ఇప్పటికైనా పరిహారం త్వరగా అందించాలని వేడుకుంటున్నారు.
మేం యేడికి పోవాలె..
Edulapuram Reservoir in Wanaparthy : "మా ఇండ్లు, పొలాలు అన్ని పోయినయి. మేం ఎట్ల బతకాలే. వాళ్లు ఇచ్చిన పైసలు మాకేడ సరిపోలేదు. కొందరికి ఇంకా పైసలు రాలేదు. రేకుల షెడ్లలో బతుకుతన్నం. గాలి గట్టిగొస్తే రేకులు లేస్తన్నయ్. సలేమో సంపుతంది. మా పిల్లలను పట్టుకుని ఏడికని పోవాలె. మేం ముసలొల్లం అయితన్నం. మా గతేంది."
- బాధితులు
ఇండ్లెప్పుుడు కట్టిస్తరు..
"రిజర్వాయర్ వల్ల మా పొలాలు మొత్తం పోయినయి. ఇక్కడ రేకులు వేసుకుని బతుకుతన్నం. ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇంకెప్పుడు కట్టిస్తరు. రెండు నెలల్ల డబ్బులు అస్తయన్నరు. ఇప్పడికీ రాలేదు. ఈ చెలకల వెంబడి రేకులు, గుడిసెలు వేసుకున్నం. రాత్రిపూట పాములు, పురుగులు వస్తన్నయ్. ప్రాణాలు అరచేతిల పెట్టుకుని బతుకుతన్నం. బాత్రూంలు కూడా లేక మస్త్ ఇబ్బంది అయితంది. మా ఊరంతా వలసపోయింది. చెట్టుకొకలు పుట్టకొకలం అయినం. జర సర్కార్ మా మీద దయతలిచి.. మాకొచ్చే పైసలు ఇచ్చి ఇండ్లు కట్టియ్యాలె."
- బాధితులు
పరిహారం ఇచ్చాం..
Edulapuram Reservoir Expatriates : విడతలవారీగా నిర్వాసితులకు పరిహారం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. బండరావిపాకుల గ్రామంలో 978 మంది కుటుంబాలకు సంబంధించిన.. 992 ఎకరాలకు నష్టపరిహారం చెల్లించామని వెల్లడించారు. కొంకపల్లిలో 321 కుటుంబాలకు సంబంధించిన 389 ఎకరాలకు పరిహారం ఇచ్చామన్నారు. ఇప్పటికే 55 కోట్లు మంజూరు చేయించి పునరావాసం కల్పనకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. అధికారులు త్వరతగిన పునరావస చర్యలు చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు.
- ఇదీ చదవండి : 'హామీలు తుంగలో తొక్కారు.. గ్రామ రూపు మార్చేశారు'