గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు తప్పవని వికారాబాద్ జిల్లా పాలనాధికారి పౌసమి బసు అధికారులను హెచ్చరించారు. కొడంగల్ మండలంలోని ఆలేడులో కలెక్టర్ పర్యటించారు. గ్రామంలోని వీధుల వెంట తిరిగి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వాహణను పరిశీలించారు. రోడ్లపై మురుగు నీరు నిల్వ ఉండటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామంలో చాలా మంది మరుగుదొడ్లు నిర్మించుకున్నా... వాటిని వాడకుండా ఇతర పనులకు వాడుకుంటున్నారని గమనించి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి మరుగుదొడ్లు నిర్మించి ఇచ్చినా... ఎందుకు వినియోగించుకోవడం లేదని ప్రశ్నించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరమని చెప్పారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.