డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుంది అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) అన్నారు. గ్రహంబెల్ టెలిఫోన్, రైట్ బ్రదర్స్ విమానం లాగే డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనంగా నిలుస్తుందని తెలిపారు. వికారాబాద్‌లో "మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(medicine from the sky)" ప్రాజెక్టును ప్రారంభించారు. ఔషధాల బాక్సులను సింధియా డ్రోన్‌లో పెట్టగా.. 3 డ్రోన్లలో ప్రయోగాత్మకంగా మందులు, టీకాలను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి పంపించారు. ఔషధాలను 2 కి.మీ. దూరంలో ఉన్న వికారాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి డ్రోన్ విజయవంతంగా డెలివరీ చేసింది. సరఫరా చేసిన అనంతరం తిరిగి డ్రోన్ వేదిక వద్దకు చేరుకుంది.
డ్రోన్లతో ఔషధాలు పంపుతున్న యువతకు జ్యోతిరాదిత్య(Jyotiraditya Scindia) అభినందనలు తెలిపారు. సాంకేతికతను అందించడమే ప్రధాని మోదీ స్వప్నమని చెప్పారు. "మెడిసిన్ ఫ్రమ్ ది స్కై(medicine from the sky)" ప్రాజెక్టుకు ప్రధాని మార్గనిర్దేశం చేశారని వెల్లడించారు. డ్రోన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచన ఉందని స్పష్టం చేశారు. సాంకేతికతలో మోదీ ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందన్నారు.
"సాంకేతికత వల్ల దేశ యువశక్తి ప్రపంచానికి తెలుస్తుంది. అంకుర సంస్థలను తేలిగ్గా చూడొద్దు. చిన్న పరికరం అత్యవసర స్థితిలో మందులను మోసుకెళ్తోంది. డ్రోన్‌తో మారుమూలకు మందులు వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా?. అన్నదాతలు, జ్ఞానదాతలు ముఖ్యం."
- జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి
ఏరోస్పేస్ టెక్నాలజీలో ఎన్నో మార్పులు వస్తున్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య(Jyotiraditya Scindia) అన్నారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంటరాక్టివ్ ఏరోస్పేస్ మ్యాప్ తయారు చేయబోతున్నామన్న సింధియా... అన్ని రాష్ట్రాలతో కలిసి పనిచేయబోతున్నట్లు ప్రకటించారు. ఇంటరాక్టివ్ ఏరోస్పేస్ మ్యాప్‌నకు సంబంధించిన ప్రత్యేకతలను వివరించారు.