వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌నియోజకవర్గాల్లోని పద్దెనిమిది మండలాల్లో లక్ష ఎకరాల్లో కంది పంట సాగు చేశారు. జనవరి, ఫిబ్రవరిలో 14,099 మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో దిగుబడులను విక్రయించారు. వీరిలో కొంతమందికి నెల కిందట రూ.55 కోట్లు, ఇటీవల రూ.24 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 4,800 మందికి రూ.32 కోట్లు రావాల్సి ఉంది.
వడ్డీ భారం...
కొంతమంది రైతులు సాగు సమయంలో ఎరువులు, పురుగుల మందు కొనుగోలుకు అప్పులు చేశారు. ఇంకొందరు ఎరువుల దుకాణాల్లో అరువుకు సమకూర్చుకున్నారు. అడ్తి, ఎరువుల దుకాణదారులకు సైతం దిగుబడులను విక్రయించిన వెంటనే నగదు చెల్లించేందుకు హామీ ఇచ్చారు. తీరా డబ్బులు చేతికందక పెట్టుబడి సొమ్ముపై రూ.2 నుంచి రూ.5 వడ్డీ భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్‌పెట్టుబడులకు...
మరో రెండు వారాల్లో ఖరీఫ్‌సీజన్‌సాగు పనులు మొదలు కానున్నాయి. దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులను సమకూర్చుకోవడం, కూలీలకు చెల్లింపులు జరిపేందుకు వేలాది రూపాయల పెట్టుబడులు అవసరం కానున్నాయి. ప్రభుత్వం కందులకు సంబంధించి నగదు చెల్లిస్తే అప్పులుపోను మిగిలిన నగదు పెట్టుబడులకు ఖర్చు చేసేందుకు రైతులు యోచిస్తున్నారు. వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరుతున్నారు.
త్వరలోనే చెల్లిస్తాం...
కందుల కొనుగోలుకు సంబంధించి బకాయి డబ్బులు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందవద్దు. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం.
-జ్యోతి, డీఎం, మార్క్‌ఫెడ్