పురపాలక సంఘాల పరిధిలో భవన నిర్మాణ అనుమతుల విషయంలో పలు అవినీతి ఆరోపణలున్నాయి. అనుమతులలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. తద్వారా నిర్మాణాలు సకాలంలో పూర్తికావడంలేదు. ఇక మీదట పనుల్లో వేగంతోపాటు, పారదర్శకమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌లో నిర్మాణ అనుమతులు జారీ చేసేలా ‘టీఎస్- బీ పాస్ విధానం కింద కొత్త నిబంధనలు తీసుకు వచ్చింది. దీని అమలుకు అవసరమైన సాంకేతిక అంశాలను కొలిక్కి తెస్తున్నారు. ఆన్‌లైన్‌లో రికార్డులు ఆప్‌లోడ్ చేయటం వంటి పనులు పూర్తి చేస్తున్నారు. ఈ విధానం పక్కాగా అమలైతే వికారాబాద్ జిల్లాలోని పట్టణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి దరఖాస్తు చాలు
- టీఎస్-బీపాస్ కింద ఒకే ఉమ్మడి దరఖాస్తు చేయవచ్చును. ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తును పరిశీలించి 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. లేకుంటే అనుమతించినట్లుగానే భావించి 22వ రోజున ఆన్‌లైన్‌లో అనుమతి పత్రాన్ని ఆటోమెటిక్‌గా దరఖాస్తు దారునికి ఇస్తారు.
- స్వీయ ధ్రువీకరణ ఆధారంగా జారీ చేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీని నిర్వహిస్తారు. వాస్తవాలు తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేపడితే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధింపు, లేదా కూలగొట్టడం, స్వాధీనం చేసుకోవడం, సీల్ చేయడం చేస్తారు.
- తాత్కాలిక లేఅవుట్ ప్లాన్ అనుమతి పత్రాన్ని స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్‌లైన్ పద్ధతిలో 21 రోజుల్లో ఇవ్వనున్నారు.
కార్యాలయాలకు రావాల్సిన పనిలేదు
టీఎస్-బీపాస్ విధానం వికారాబాద్‌లో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ విధానం కింద ఇప్పటికే దరఖాస్తులు వస్తున్నాయి. భవన నిర్మాణాలు చేపట్టేవారు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. దీనపై పట్టణ ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తాం.
- బోగేశ్వర్లు, కమిషనర్, పురపాలక సంఘం, వికారాబాద్
జారీ విధానం ఇలా...
- 75 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాట్లలో గ్రౌండ్+1 వరకు నివాస భవనానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. దీనికోసం నామ మాత్రంగా రూ.1 చెల్లించి తక్షణమే రిజిస్ట్రేషన్ ధ్రువ పత్రం పొందవచ్ఛు
- 75 చ.గ.నుంచి 200చ.మీ. విస్తీర్ణం ప్లాట్ల గ్రౌండ్+1 వరకు 7 మీటర్ల ఎత్తు ఉండే నివాస భవనాలకు తక్షణమే అనుమతి ఇస్తారు.
- 239.20 (200 చ.మీ.) విస్తీర్ణంపైన, 598 చ.గ.(500 చ.మీ) గల ప్లాట్లలో గ్రౌండ్+2 అంతస్తుల వరకు గృహ నిర్మాణానికి స్వీయ ధ్రువ పత్రం ఆధారంగా తక్షణమే అనుమతి ఇవ్వనున్నారు. వీటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత స్వాధీనతా ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.
- 598 చ.గ.(500చ.మీ) గ్రౌండ్+2 అంతస్తుల కంటే ఎక్కువ ఉండే ప్లాట్లలో అన్ని నివాసేతర భవనాలకు ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతి ఇస్తారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
అనధికార కట్టడాలను, లే అవుట్‌లను గుర్తించడానికి, నియంత్రించడానికి జిల్లా పాలనాధికారి అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ప్రభుత్వం నియమిస్తుంది. భూమి అభివృద్ధికి అవసరమైన అనుమతులు తీసుకోకుండా అనధికారికంగా అభివృద్ధి పనులు చేపడితే రిజిస్ట్రేషన్ శాఖ నిర్ధారించిన భూ విలువలో 25 శాతం అపరాధ రుసుం విధిస్తారు.