Revanth Reddy Nomination in Kodangal : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరే ముందు జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో రేవంత్.. వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం, తన నియోజకవర్గానికి బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు.. కొడంగల్ హెలీప్యాడ్ నుంచి నేరుగా గడీబాయి శివాలయానికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం, తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి భారీ వాహనశ్రేణితో ర్యాలీగా వెళ్లారు. ర్యాలీ ప్రారంభించే ముందు అక్కడ ఆయన ప్రసంగించారు. ప్రసంగం అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి బయలుదేరారు.
Revanth Reddy Comments on BRS : కాంగ్రెస్ జెండా ఎగురవేయమని లక్షలాది మంది కార్యకర్తలు తనను ఆశీర్వదించారని రేవంత్ రెడ్డి తెలిపారు. కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే అని అన్నారు. తనకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. తనకోసం కాదని.. కార్యకర్తలు, ప్రజల కోసమేనని పేర్కొన్నారు. తనకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు అండగా నిలిచారని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుందని రేవంత్‌రెడ్డి నిలదీశారు.
కొడంగల్ ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంటుకు పంపిచారని.. కడుపులో పెట్టుకుని ఇక్కడి ప్రజలు చూసుకుంటే ఆయన మాత్రం అభివృద్ధిని విస్మరించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కొడంగల్ యువతకు ఉద్యోగాలు అందించేందుకు జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని.. ఇవి తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతాయని చెప్పారు. కొడంగల్ ఆత్మగౌరవం కోసం శాసనసభలో పోరాటం చేశానని గుర్తు చేశారు. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఒక్కసారైనా కొడంగల్ అభివృద్ధి గురించి మాట్లాడారా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
కొడంగల్ ప్రజలు ఐక్యంగా ఉండి తనను గెలిపించాలని రేవంత్‌రెడ్డి కోరారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వచ్చిన మెజార్టీ కంటే అధికంగా తనను గెలిపించాలన్నారు. తనను గెలిపిస్తే కొడంగల్‌కు కృష్ణా జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కొడంగల్‌లో బీఎస్సీ నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కొడంగల్ ప్రజలకు ఆత్మగౌరవం ఉండేదని పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని.. తనకు సమయం ఉన్నప్పుడల్లా కొడంగల్‌కు వస్తానని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
"కొడంగల్‌లో ప్రతి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే. నాకు ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. నాకోసం కాదు.. మీకోసమే. నాకు పదవి లేకపోయినా కొడంగల్ ప్రజలు నాకు అండగా నిలిచారు. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి జరిగిందా?. కొడంగల్ ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ మళ్లీ ఎలా ఓట్లు అడుగుతుంది." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Contest from Kamareddy : 'హై కమాండ్ ఆదేశిస్తే.. కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేస్తా'