వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. చుట్టూ ఉన్న 150కి పైగా గ్రామాలకు చెందిన రోజూ కూలీలు ఇక్కడే ఉపాధి పొందుతున్నారు. వీరిలో కొందరికి మాత్రమే సొంత ఇళ్లు ఉన్నాయి. మిగిలిన వారంతా అద్దెలు చెల్లిస్తున్నారు. ఇటువంటి వారిలో ఎక్కువ శాతం మంది గృహాలు నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. పట్టణంలో ఎక్కడైనా స్థలం లభిస్తే కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఇలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంత మంది తమ స్థలానికి ఆనుకుని ఉన్న విశాలమైన ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. స్థలం తమదే అన్నట్లు నమ్మించి ఇతరులకు విక్రయించి రూ.లక్షల్లో వసూలు చేసి, ఏకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తీరా అసలు మోసం బయటపడటంతో కొన్నవారు లబోదిబోమంటున్నారు.
చిలుకవాగు పరీవాహక ప్రాంతంలో..
చిలుకవాగు పరీవాహక పరిసరాల్లో చాలా మందికి వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పట్టణానికి దగ్గరలో ఉన్నందన డిమాండ్ పెరిగింది. పొలాలు ఉన్న వారు తమ భూముల్లోనే కొంత భాగాన్ని ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. వీటిని ఆనుకుని చిలుకవాగు పరీవాహక భూమి ఉంది. పొలం యజమానులు ఆ ప్రదేశం తమదే అన్నట్లు అన్నట్లు నమ్మించి విక్రయాలకు పాల్పడుతున్నారు. కొనుగోలు దారులకు అసలు విషయం తెలియక మోసపోతున్నారు.
రిజిస్ట్రేషన్ సమయంలో తమ భూములకు సంబంధించిన సర్వే నంబరు వాడగా ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటున్నారు. ఇటీవల పరీవాహక ప్రాంతాన్ని రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. అక్రమంగా ఏర్పాటు చేసిన ప్లాట్లు, ఇతర ఆక్రమణలు ఉన్నాయని తేల్చారు. వీటిని అధికారులు ఎపుడైనా కూలదోయనున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆ ప్రాంతంలో స్థలాలు కొన్నవారు ఆందోళనకు గురవుతున్నారు. తాండూరు నుంచి గౌతాపూరుకు వెళ్లే మార్గంలోని ప్రధాన వాగు పరీవాహక ప్రదేశాన్ని చాలా మంది తమకు తోచిన విధంగా మొదట కబ్జా చేశారు. కొన్నేళ్లు గడిచాక గుట్టుగా రూ.లక్షల్లో ఇతరులకు విక్రయించారు. . గొల్లచెరువు, దాని కింది భాగంలోని గండి చెరువు శిఖం భూములను ఇష్టానుసారం అన్యాక్రాంతం చేసుకున్నారు.
శ్మశానాన్నీ వదలలేదు
పాత తాండూరు నుంచి కాగ్నానదికి వెళ్లే దారిలో ఓ వ్యక్తికి 12 ఎకరాల పొలం ఉంది. ఆరు ఎకరాల స్థలాన్ని పట్టణానికి చెందిన వ్యక్తికి విక్రయించారు. ఎకరాన్ని ఓ సామాజిక వర్గానికి శ్మశాన వాటికకు వదిలారు. ఆయన హైదరాబాద్‌కు వెళ్లగా మిగతా అయిదు ఎకరాలను ఎవరో కబ్జా చేసి ప్లాట్లుగా చేశారు. శ్మశాన వాటికకు కేటాయించిన స్థలానిది అదే పరిస్థితి. ఈ ప్రాంతంలో 100 మందికి పైగా ప్లాట్లను కొనుగోలు చేశారు. ఇదే స్థలం ప్రస్తుతం వివాదస్పదంగా మారగా కొనుగోలుదారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగితాలపైనే విక్రయాలు
తాండూరులో చాలా మంది లేఅవుట్లు చేయకుండా కేవలం కాగితాలపైనే పటాలు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇది వరకే ప్లాట్లు విక్రయమైన స్థలాలను ఆనుకుని స్థలాలు ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ముందుగా పరిశీలిస్తున్నారు. తమకు అనువుగా ఉన్నాయనుకున్న వాటిని కొనుగోలు చేయడమో, సదరు యజమానితో తనఖా పెట్టించుకోవడమో చేస్తున్నారు. ఇలాంటి స్థలాల్లో ప్లాట్లను విక్రయించేందుకు అవసరమైన మ్యాపులను కాగితాలపై గీస్తున్నారు.
అనంతరం ధరను నిర్ణయించి అంట గడుతున్నారు. అంతేకాకుండా, అమ్ముడుపోయిన ప్లాట్లను ఇతరులకు విక్రయిస్తున్నారు. ముందుగా తీసుకున్న వ్యక్తులు పనులు చేసేందుకు వెళితే, కొత్తగా కొనుగోలు చేసిన వ్యక్తులు అక్కడ ప్రత్యక్షమయి గొడవకు దిగుతున్నారు. ఒకే ప్లాటు ఇద్దరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ జరిగిన విషయంలో, అమ్మిన వ్యక్తుల వద్దకు వెళితే విషయాన్ని మీరే తేల్చుకోండని చేతులెత్తేస్తున్నారు. లేదంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఎంతో కొంత తీసుకుని పక్కకు జరగాలని ఉచిత సలహా ఇస్తున్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అన్యాక్రాంతమైన స్థలాలను పరిశీలించి సర్వే చేయించి స్వాధీనం చేసుకుంటాం. ఏదైనా సర్వే నంబరు భూమిలో ప్లాట్లను కొనుగోలు చేసే వ్యక్తులు అప్రమత్తతో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొనుగోలు చేయబోయే ప్లాట్‌కు లేఅవుట్ ఉందా లేదా అని పరిశీలించాలి. ఉంటేనే కొనుగోలు చేయాలి. విక్రయించే వ్యక్తులు ఒక సర్వే నంబరులో స్థలాన్ని చూపించి, మరో నంబరులోని స్థలాన్ని విక్రయించి, ఇదే మీదని నమ్మిస్తారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థలం వద్దకు తప్పకుండా వెళ్లాలి. అంతా సవ్యంగా ఉందని నమ్మకం కుదిరాకే కొనుగోలు చేయాలి. లేఔట్ లేని స్థలాల్లో ప్లాట్లను కొనుగోలు చేస్తే సమస్యలు ఎదురవుతాయి. శ్మశాన వాటికలు, నాలాలు, చెరువుల శిఖం భూముల్లోని స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు.
-అశోక్‌కుమార్, ఆర్డీఓ, తాండూరు
ఇదీ చదవండిః యథేచ్ఛగా ఇసుక దందా... చూసీచూడనట్లు అధికారుల పంథా!