రోడ్డు వేసేందుకు ప్రభుత్వం దగ్గర బడ్జెట్(budget) లేదని పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి(mla mahesh reddy) వ్యాఖ్యానించారు. రోడ్డు కావాలని స్థానికులు విజ్ఞప్తి చేయగా... రైతు బంధు(rythu bandhu), పింఛన్లు(pensions), కల్యాణ లక్ష్మి(kalyana lakshmi) వంటి పథకాలకే ప్రభుత్వం ఎక్కువ నిధులు ఖర్చు చేస్తోందని అన్నారు. రోడ్లు కావాలంటే ఆ పథకాలను ఆపుతామని పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా పూడురు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయనను... రోడ్డు వేయించాలని మైసమ్మ గడ్డ తండా వద్ద స్థానికులు కోరారు.
ఎన్నికలప్పుడు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారని... వర్షం పడితే గ్రామానికి రాకపోకలు ఇబ్బందిగా మారుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదంటూ గ్రామస్థులతో ఎమ్మెల్యే చెప్పారు. సంక్షేమ పథకాలకే ఖర్చు చేస్తున్నామని అన్నారు.
రోడ్డు వేయడానికి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. రైతు బంధు, కల్యాణ లక్ష్మి, పింఛన్లకే ఎక్కువ ఖర్చు చేస్తున్నాం. అవి వద్దంటే చెప్పండి... రోడ్డు వేయిస్తాం. కరోనా వల్ల ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వర్షం పడినందునే రోడ్డు పాడైంది. త్వరలోనే రోడ్డు వేయిస్తాం.
-మహేశ్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే
ఇదీ చదవండి: విషాదం: పొలంలో విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతి