వికారాబాద్ జిల్లాలో తాండూరు, వికారాబాద్ పాత మున్సిపాలిటీలు కాగా కొడంగల్, పరిగి కొత్తగా ఏర్పడినవి. తాండూరులో 36, వికారాబాద్‌లో 32 వార్డుల్లో కలిపి లక్షకు పైగా జనాభా ఉంది. రోజూవారీగా గృహాల నుంచి 20 టన్నుల చెత్త బయటికి వస్తోంది. దీన్ని సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేందుకు టాక్టర్లు, ట్రాలీలు, రిక్షాలు, ట్రాలీ ఆటోలు వంటి వాటిని వినియోగించారు. ట్రాక్టర్ల ఇంజిన్లను చెత్త తరలింపుకే కాకుండా వేసవిలో కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడానికి వినియోగించారు. కాలక్రమేణా ఇవన్నీ మరమ్మతుకు గురయ్యాయి. అప్పుడప్పుడూ ట్రాక్టర్ల ఇంజిన్‌లు, ట్రాలీలను మరమ్మతుకు వస్తే బాగు చేశారు. తర్వాత వాటిని పట్టించుకోకుండా అద్దె ట్రాక్టర్లను వినియోగించారు.
పారిశుద్ధ్య విభాగంలో పనిచేసే కార్మికులు వినియోగించే రిక్షాలు మరమ్మతుకు గురైతే వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేశారు. అద్దె ప్రాతిపదికన వినియోగించిన ట్రాక్టర్ల స్థానంలోనూ కొత్తవి సమకూరాయి. దీంతో పాత వాటి వినియోగం లేకపోవడంతో ఏళ్ల నుంచి వదిలేయడంతో దెబ్బతిన్నాయి. ఇక కొత్త మున్సిపాలిటీలుగా ఆవిర్భవించిన కొడంగల్, పరిగి గతంలో గ్రామపంచాయతీలుగా ఉన్నవే. చెత్తసేకరణకు రిక్షాలు, ఒకటి రెండు ట్రాక్టర్ల చొప్పున వినియోగించారు. పరిగి 15 కొడంగల్ 12 వార్డులతో మున్సిపాలిటీలుగా ఆవిర్భవించగానే ప్రభుత్వం కొత్త ట్రాక్టర్లు, రిక్షాలను సమకూర్చింది. మరమ్మతుకు గురైన పాత ట్రాక్టర్లను బాగు చేసి వినియోగిస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయం మేరకు విక్రయిస్తే..
తాండూరు మున్సిపాలిటీలో 8 ట్రాక్టర్ ట్రాలీలు, రెండు ట్రాలీ ఆటోలు, ఐదు ట్రాక్టర్ ఇంజిన్లు, నీటిసరఫరా ట్యాంకు, పదికిపైగా రిక్షాలతో పాటు వాహనాలకు సంబంధించిన ఇతర విడిభాగాలు ఉన్నాయి. ఇవన్నీ తుక్కుగా మారాయి. వికారాబాద్ పురపాలక సంఘంలోనూ రెండు ట్రాక్టర్ ఇంజిన్లు, ట్రాలీలు, కొన్ని రిక్షాల పరిస్థితి ఇదే విధంగా ఉంది. ప్రభుత్వం అన్ని శాఖల్లోని పాత వాహనాలను విక్రయించడానికి గడచిన ఆగస్టులోనే నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పురపాలక సంఘాలు తుక్కుగా మారిన వాహనాలను విక్రయించడానికి మార్గం సుగమమైంది.
కౌన్సిల్ ఆమోదం పొందాకే..
మున్సిపాలిటీల్లో వినియోగంలో లేకుండా పాతవిగా మారిన వాహనాలను విక్రయించడానికి ముందు అధికారులు పాలక వర్గం ఆమోదం కోసం కౌన్సిల్ సమావేశం జరిగే రోజున ఎజెండాలో పొందుపర్చాలి. ఏకగ్రీవ ఆమోదం లభించగానే తుక్కు వాహనాలను కొనుగోలు చేయడానికి టెండర్లను నిర్వహించడమో లేదంటే వేలం వేయడమో చేస్తారు. మున్సిపాలిటీలు ఆశించిన ధర కంటే ఎక్కువ ధర ఎవరు చెల్లిస్తే వారికే వినియోగంలో లేని వాహనాలను విక్రయిరచాలనే నిబంధన ఉంది.
కౌన్సిల్ దృష్టికి తీసికెళతాం..
వినియోగంలో లేని వాహనాలు, తుక్కుగా మారిన ట్రాలీలు, రిక్షాలు వంటి వాటిని విక్రయించే విషయమై ఉన్నతాధికారుల అనుమతితో కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెడతాం. ఆమోదం లభిస్తే నిబంధనలను అనుసరించి విక్రయిస్తాం. అయితే ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుంచి పాతవాహనాలను, తుక్కును విక్రయించాలనే విషయంలో ఆదేశాలు రాలేదు.
-యూనీస్, డీఈఈ, తాండూరు పురపాలక సంఘం