వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఎంపీడీవో తారిఖ్ అన్వర్.. ఓ అధికారిగా కాకుండా ఓ గుత్తేదారులా వ్యవహరిస్తున్నాడని సర్పంచుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామ సర్పంచులకు తెలియకుండా గ్రామ పంచాయతీ ఖాతాల్లోని డబ్బును ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నాడని సర్పంచ్లు వాపోయారు.
మొక్కల సంరక్షణ కంచె కోసం ఒక్కొక్క గ్రామపంచాయతీ నుంచి రూ. 14, 000 వేల చొప్పున 44 గ్రామ పంచాయతీలకు సంబంధించిన చెక్కులు తనకు సంబంధించిన వ్యక్తులపై తయారు చేయిస్తున్నాడని తెలిపారు. గతంలో కూడా గడ్డి కోసే యంత్రం కొనుగోలుకై రూ. 10,500లను బ్యాంకు నుంచి ఎంపీడీవో అన్వర్ డ్రా చేసుకున్నాడని అన్నారు.
గ్రామపంచాయతీ పరిధిలోని మరుగుదొడ్ల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడ్డాడని.. సర్పంచుల ప్రమేయం లేకుండానే పలు అభివృద్ధి నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మింపజేశాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎంపీడీవోపై చర్యలు తీసుకోకుంటే రెండోవిడత పల్లెప్రగతి కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని సర్పంచుల సంఘం అధ్యక్షుడు శంకర్ నాయక్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్