రాష్ట్రంలో తెరాస, భాజపాలు దోస్తీ చేస్తున్నాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఓ హోటల్లో నిర్వహించిన చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి 2023లో గెలిచి బహుమతిగా ఇవ్వాలన్నారు. నయా కాంగ్రెస్ నయా తెలంగాణే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 78 సీట్లు గెలవడం ఖాయమన్నారు. ఎన్నికలకు మరో 25 నెలలు మిగిలి ఉందని.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పని చేయాలన్నారు. భాజపా, తెరాస ఒక్కటేనని రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టడమే మిగిలి ఉందన్నారు.
సీఎం కేసీఆర్ తన ఆస్తులు కాపాడుకునేందుకు దిల్లీకి వెళ్తారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో కులాల ప్రస్తావన ఉండదని.. బూత్, గ్రామీణ, మండల, జిల్లా స్థాయి కమిటీలు కలిసి పని చేయాలనేదే రాహుల్ గాంధీ ఉద్దేశమని తెలిపారు. కార్యకర్తలందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. చేవెళ్ల పార్లమెంట్లో ఉన్న నాయకులందరూ సమష్టిగా కృషి చేయాలని మాణికం ఠాకూర్ కోరారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: CONGRESS: 'కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణకు విముక్తి కావాలి'