వికారాబాద్లో కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు కూడా దాదాపు 100మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. వీళ్లలో 58 మందిని ఆస్పత్రిలో చేర్చుకొని చికిత్స అందిస్తున్నారు. మిగతా 45మందిని ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఇంటికి పంపించారు. శనివారం ఆస్పత్రిలో చేరిన 100మందిలో సగానికి పైగా బాధితులు తేరుకోవడం వల్ల వాళ్లను ఇంటికి పంపించారు. ప్రస్తుతం వికారాబాద్ ఆస్పత్రిలో 90మంది వరకు బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 291 మంది బాధితులు కల్తీకల్లు బారినపడ్డారు. అందరి ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అబ్కారీ శాఖ సంచాలకులు సర్పరాజ్ అహ్మద్ వికారాబాద్లో పర్యటించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం.... చిట్టిగట్టు గ్రామంలోని కల్లుడిపోను పరిశీలించారు. ఇప్పటికే డిపోను అబ్కారీ అధికారులు సీజ్ చేశారు. కల్లుడిపోకు ఎక్కడి నుంచి కల్లును తీసుకొస్తున్నారనే విషయాన్ని సర్పరాజ్ అహ్మద్ అడిగి తెలుసుకున్నారు. గ్రామాలకు సరిపడా ఈత వనాలు లేకున్నా... ఎక్కడి నుంచి కల్లు తీసుకొస్తున్నారని ఆయన అధికారులను ప్రశ్నించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అబ్కారీ శాఖ సంచాలకులు సర్ఫరాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లీ కల్లు నిరోధం పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: కల్తీ కల్లు కల్లోలం: 212 మందికి అస్వస్థత, ఒకరు మృతి