Heavy Rains in Telangana: వరుణుడి ప్రతాపానికి వికారాబాద్ జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండూర్, వికారాబాద్, పరిగి, కొడంగల్ ప్రాంతాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి.. రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున మంటలు నీటమునిగాయి. వికారాబాద్ జిల్లాలో భారీ ప్రవాహంతో కోట్‌పల్లి ప్రాజెక్టు నిండకుండను తలపిస్తోంది. వికారాబాద్ పట్టణానికి తాగునీటినందించే శివసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. సర్పంచ్‌పల్లి, లక్నాపూర్, అల్లాపూర్, జుంటుపల్లి ప్రాజెక్టులు భారీ వర్షాలతో నిండిపోయాయి. వాగులు ఉప్పొంగుతుండటంతో.. హైదరాబాద్ వెళ్లే వాహనాలు కొడంగల్, పరిగి మీదుగా వెళ్తున్నాయి. అనంతగిరిలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి నీరు చేరాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. చెరువులు అలుగు పారుతున్నాయి. చెర్యాలలోని ఆకునూరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లెనిన్‌నగర్‌లో చాలా ఇళ్లు జలమయమయ్యాయి. వస్తువులు, నిత్యవసర సరుకులు తడిసిపోవటంతో కాలనీవాసులు అవస్థలకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్దదైన మల్కాపూర్ చెరువు అలుగు పారుతుండటంతో.. దిగువన వందల ఎకరాల పంటలు వర్షార్పణమయ్యాయి. తెర్పోల్, కొండాపూర్ వాగులు కలిసిపోయి పారుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. బాసర రైల్వే స్టేషన్ పరిసరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రవీంద్రపూర్ కాలనీని వరద చుట్టుమిట్టింది. గోదావరి నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద పొంగుతుండటంతో... కేసముద్రం - గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవీ చూడండి: