వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. తాండూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన అకాల వర్షంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. రోడ్లపై వరద ఏరులై పారింది. ఆ వరదలో పలుచోట్ల కూరగాయలు కొట్టుకుపోయాయి. కూరగాయలు అమ్ముకుని బతికే చిరువ్యాపారులను ఈ అకాలవర్షం దెబ్బతీసింది. వానకు ప్రధాన రహదారిపై నీరు నిలిచి గల్లీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో జనాలు అవస్థలు పడ్డారు.
భయాందోళనకు గురిచేసిన వడగండ్ల వాన: పరిగిలో ఏకధాటిగా అరగంటపాటు భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఈ భారీ వడగండ్ల వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిగి పరిసర ప్రాంతాల రహదారులపై ఈదురుగాలుల వల్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. స్థానికులు రోడ్లపై వెళ్లేందుకు భయాందోళనకు గురయ్యారు. వడగండ్ల వల్ల అక్కడక్కడ మామిడి తోటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు.
పిడుగుపాటుకు ఆవు, ఆరు మేకలు బలి: పరిగి మండలం రంగంపల్లి పిడుగుపాటుకు గురై ఒక ఆవు, ఆరు మేకలు మృతి చెందాయి. వీటిని మేపేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. స్వల్పంగా గాయాలైన రాములు, నర్సింహులును స్థానికు పరిగి ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన పశువులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: