Forest Gun Fire: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవి ఇది. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉంది. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలోనే ఉంది. ఈ దామగుండం అటవీ ప్రాంత శివారులో... ఎన్నో ఫాంహౌస్‌లు ఉన్నాయి. రాత్రైతే చాలు ఉన్నత కుటుంబాలకు చెందిన వారు... ఈ ప్రాంతానికి పెద్దపెద్ద వాహనాల్లో వచ్చి... షికార్లు చేస్తుంటారు. ఎన్నోసార్లు అడవి జంతువులు, మూగ జీవులపై సరదా కోసం తుపాకీతో కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి.
అర్ధరాత్రి షికారులు...
గతంలో అర్ధరాత్రి సమయాల్లో షికారు చేసేవారు. అటవీ శాఖ అధికారుల పహారాతో ఇప్పుడు రాత్రి 8 అయితే చాలు షికారు చేస్తూ జంతువులపై చంపేస్తున్నారు. తాజాగా బుధవారం రాత్రి సమయంలోనూ... దామగుండం సమీపంలోని ఆలయం వద్ద తుపాకుల మోత రావడంతో.. స్థానికులు అప్రమత్తమై అక్కడకి వెళ్లి గాలించారు. అప్పటికే వారంతా పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు.
మూడు వేల నుంచి 4 వేల ఎకరాల అటవీ ప్రాంతంలో.. ఎన్నో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయని... వాటిని తుపాకులతో కాల్చి చంపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. కూతవేటు దూరంలో జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఉన్నా... చూస్తూ ఊరుకుంటున్నారు తప్పించి చర్యలు తీసుకోవట్లేదని... గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వాళ్లను వదిలేసి...
పంట పొలాలకు వెళ్తుంటే.. అటవీ అధికారులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేసి కేసులు పెడుతున్నారని.. స్థానికులు ఆరోపిస్తున్నారు. జంతువులను తుపాకులతో కాల్చి చంపే వారిని వదిలేసి.. తమ పట్ల జులుం చూపిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇకనైనా తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని... స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: