వికారాబాద్ జిల్లా గోవిందాపూర్కు చెందిన రాములు తనకున్న కొద్దిపాటి భూమిలోనే వర్షాధారంగా వరి, కూరగాయలు పండించేవాడు. ఇటీవల వర్షాభావ పరిస్థితులు తలెత్తడం వల్ల రెండు బోరుబావులు తవ్వించినా వరుణుడు కరుణించలేదు. ఫలితంగా అప్పులపాలయ్యాడు. తల్లిలాంటి భూమిని అమ్ముకుని అప్పు తీర్చుకుందామనుకుంటే పిల్లలు గుర్తొచ్చారు. తెలిసినోళ్లందరి దగ్గరా చేయిచాచాడు. ఎక్కడా చిల్లి గవ్వ పుట్టలేదు. చేసేది లేక ప్రాణంగా చూసుకుంటున్న కాడెద్దులను అడ్డకి పావుసేరులా.. తెగనమ్ముకుని అప్పు తీర్చాడు. వరుణుడు కరుణిస్తే మళ్లీ ఎద్దులు కొనకపోతానా అని ఆశగా ఎదురు చూశాడు. కానీ రాములు ఆశలు అడియాశలయ్యాయి.
ఎద్దుల స్థానంలో తానే...
బంగారం పండాల్సిన నేల బీడుగా మారుతోంది. పుడమితల్లి శోకాన్ని చూసిన రాములు కుమిలిపోయాడు. ఎవరికి వారే తమ పొలాల్లో దుక్కి దున్నుకుంటున్నారు. గట్టుపై కూర్చుని తనవైపే దీనంగా చూస్తున్న పూడమిని చూసి ఓ నిర్ణయానికొచ్చాడు. తానే కాడెద్దై దుక్కిదున్ని సాగుచేయాలనుకున్నాడు. ఎడ్లకు బదులు తానే నాగలి లాగుతూ దుక్కి దున్నుకున్నాడు. చేతులు బొబ్బలెక్కిపోతున్నా... పగిలిన పాదాల్లోంచి మంట పుడుతున్నా.. ఎండ మండిపోతున్నా... బాధలన్నీ మునిపంటి కింద బిగబట్టి మూడు రోజులు శ్రమించి దుక్కి దున్ని చదును చేశాడు.
ఎంత కష్టమొచ్చిందయ్యా..!
ప్రస్తుతం వంకాయ తోట వేస్తున్నాడు రాములు. ఇతని కష్టాన్ని చూసిన చుట్టుపక్కల రైతులు, దారిన పోయేవారు ఎంతకష్టమొచ్చిందయ్యా అంటూ ఓదారుస్తున్నారు. అందుకు ఇతను చెప్పే సమాధానంలో అప్పుల భారం పిల్లలపై వేయకూడదనే తపనే కనబడుతుంది.
రాములు పడుతున్న కష్టాన్ని చూసి పుడమి తల్లి కన్నీరు కార్చింది. పగుళ్లు వచ్చిన భూమి కూడా నాగలికి దారిచ్చింది. ఈరోజు నష్టపోతేనేమి రేపైనా పంట వస్తుంది.. తన అప్పులు తీరిపోతాయనే ఆశతో ఆ అన్నదాత పడిన కష్టాలను మరచిపోయి తాను సాగుచేస్తున్న పంటను మురిపెంగా చూసుకుంటున్నాడు. ఇతని కష్టాన్ని చూసి అయినా వరుణుడు కరుణించి జల్లులు కురిపించాలని ఎదురుచూస్తున్నాడు.
ఇదీ చూడండి: "ఏకకాలంలో రుణమాఫీ చేయాలి"