వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో పూడూరు, పరిగి మండలాల్లో కూరగాయల సాగు అధికం. స్పల్ప కాలిక రకాలను సాగు చేస్తూ అధికాదాయాన్ని పొందుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల పరిధిలో నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు ఉన్నాయి. ఇవి కూరగాయల సాగుకు అనువైనవి. వీటిలో గతంలో సంప్రదాయ పంటలను సాగు చేసే వారు. అలాంటిది రెండు నెలల వ్యవధిలోనే వచ్చే కూరగాయలు, ఆకు కూరల సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.
నగర విపణులకు తరలింపు...
హైదరాబాద్ నగరం కూడా దగ్గరలోనే ఉండటంతో స్థానికంగా పండిస్తున్న పంటలను అక్కడి విపణులకు తరలిస్తున్నారు. నవాబుపేట, వికారాబాద్, ధారూరు, మర్పల్లి, పూడూరు, పరిగి, మోమిన్‌పేట తదితర మండలాల పరిధిలోని రైతులు టమాటా, వంకాయ, బీర, కాకర, బెండ, బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లి, గోకర, దొండ వంటి అనేక రకాల కూరగాయ పంటలు సాగుకు ఆసక్తి చూపారు. మరి కొందరు రైతులు రకరకాల పూల పంటలు వేశారు.
ఇక్కడ పండించిన పంటను నగరంలోని వివిధ ప్రధాన మార్కెట్‌లకు తరలించి అమ్ముకుంటారు. యాసంగిలో పంట చేతికి రావాలంటే సంక్రాంతి సమయంలో రైతులు ఆయా కూరగాయ పంటలకు నాట్లు వేశారు. నారు వేసిన తరువాత 80 నుంచి 90 రోజుల మధ్య పంట దిగుబడులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం టమాటా, వంకాయ వంటి పంటల దిగుబడి జోరుగా వస్తుంది. కరోనా నేపథ్యంలో మార్కెట్ సదుపాయం లేక కొంత నష్టం వాటిల్లుతోంది.
సాగుకు ముందే ఏర్పాట్లు...
బోరు బావుల్లో నీరు తక్కువగా ఉండటం వల్ల సాగుకు ముందే డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు స్పింక్లర్లు అమరుస్తున్నారు. దీంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. పంపు ద్వారా కాలువలతో నేరుగా పారిస్తే నీరంతా అనవసరంగా భూమిలోకి ఇంకుతుంది.
ఎకరం పంటకు కాలువల ద్వారా నేరుగా పారించే నీటిని డ్రిప్ సిస్టంతో అయితే రెండు నుంచి మూడు ఎకరాల వరకు పారించవచ్చని రైతులు పేర్కొంటున్నారు. ఎకరం పొలంలో డ్రిప్ సిస్టంతో పంటలు సాగు చేయాలంటే రూ. 30 నుంచి రూ. 40 వేల వరకు ఖర్చువుతుంది. అదే స్పింక్లర్‌లు అయితే రూ. 20 రూ. 25 వేల వరకు ఖర్చువుతుందని అంచనా.
ఐదేళ్లుగా బిందు సేద్యం..
బోరు, బావి ఉన్నా కాలువలతో నీటిని పారిస్తే వేసవిలో వేసిన పంటలకు ఆశించిన నీరు సరిపడటం లేదు. దీంతో ఐదేళ్ల కిందట రూ. 15 వేల వరకు ఖర్చుపెట్టి రెండెకరాలకు సరపడా బిందు సేద్యం పరికరాలు తెచ్చుకున్నాం. యాసంగిలో వేసిన మొక్కజొన్న పంట కాలం పూర్తికావటంతో బుట్టలు తీయించాను. ప్రస్తుతం అదే పొలంలో కొత్తిమీర, మెంతం కూర సాగులో ఉన్నాయి. వేసవిలో తక్కువ రోజుల్లో చేతికివచ్చే పంటలను సాగు చేస్తున్నాం.
-మోయిన్ పాష, రైతు కేరవెళ్లి
తక్కువ నీటితో వివిధ పంటలు..
బోరులో తక్కువ నీరు ఉండటం వల్ల స్పింక్లర్‌లను అమర్చాను. ఉన్న నీటినే పొదుపుగా ఉపయోగించి ఏటా యాసంగిలో వివిధ కూరగాయ పంటలు సాగు చేస్తున్నా. ప్రస్తుతం అర ఎకరంలో టమాటా, పావు ఎకరంలో పశువులకు పచ్చిమేత సాగులో ఉంది.
-సత్యనారాయణరెడ్డి, రైతు కొత్తపల్లి