Election Campaign in Vikarabad 2023 : వికారాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. ప్రధాన పార్టీల మధ్యేకాదు వ్యక్తుల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజాక్షేత్రంలో కొట్లాడేందుకు సిద్ధమయ్యాయి. అభ్యర్థులను ప్రకటించకపోవడం వల్ల బీజేపీలో ఇంకా హడావుడి మాత్రం కనిపించడం లేదు. వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..తాండూరు నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు.
Vikarabad Politics Latest News : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం మరోసారి కొడంగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. రేవంత్‌కు పోటీగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంఛార్జిగా మంత్రి మహేందర్ రెడ్డిని నియమించిన గులాబీ దళపతి నాలుగింటికి నాలుగు నియోజకవర్గాల్లో జెండాఎగిరేసే బాధ్యతను మహేందర్ రెడ్డి భుజానికెత్తారు. మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో కారు జోరు కొనసాగుతుందని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తమ దగ్గర పనిచేయవని చెబుతున్నారు. తాను పార్టీ మారుతున్నారనే దుష్ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు.
Telangana Assembly Elections 2023 : వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మెతుకు ఆనంద్ మరోసారి పోటీ చేస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా స్వగ్రామం కేరెళ్లి నుంచి ప్రచారాన్ని ఆరంభించిన ఆనంద్ ప్రజలతో మమేకమవుతూ.. గులాబీ నేతలతో మంతనాలు సాగిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. మెతుకు ఆనంద్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌ను బరిలో దించారు. గత ఎన్నికల్లో మెతుకు ఆనంద్ గెలుపునకు కీలకంగా పనిచేసిన నేతలు కాంగ్రెస్ పంచన చేరడం హస్తానికి కొండంత బలాన్ని ఇస్తోంది. చిగుళ్లపల్లి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆరు గ్యారంటీలతో ఇంటింటా ప్రచారంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతోంది. బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు.
BRS Campaign in Vikarabad : పరిగి నియోజకవర్గంలో పాత ప్రత్యర్థులే మరోసారి తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల మహేశ్ రెడ్డికే టికెట్ దక్కగా కాంగ్రెస్ నుంచి రాంమోహన్ రెడ్డి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో మహేశ్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన రాంమోహన్ రెడ్డి.. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టికెట్ ఖరారైనప్పటి నుంచి ఆరు గ్యారంటీలతో గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మహేశ్ రెడ్డి రెండోసారి గెలిచి సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కార్యకర్తల మద్దతుతో ఊరూరా తిరుగుతూ రాష్ట్రప్రభుత్వ అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.
Vikarabad Political War : తాండూరు నుంచి గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి గులాబీ గూటికి చేరిన పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మంత్రి మహేందర్ రెడ్డితో గతంలో అంతర్గత విబేధాలున్నా అధిష్టానం కుదిర్చిన సయోధ్యతో పార్టీని గెలిపించేందుకు శ్రమిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది ఖరారు కాకపోవడం శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఆ పార్టీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. వారిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది సర్వత్రా ఉత్కంఠగా నెలకొంది. భాజపా అభ్యర్థిగా మాజీ MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగుతారనే వినిపిస్తోంది.
Congress Campaign in Vikarabad : కొడంగల్‌లో దంగల్ ఈసారి గట్టిగానే ఉండబోతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పోటీగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డినే బీఆర్ఎస్ నిలబెట్టింది. మంత్రి మహేందర్ రెడ్డి ఇంఛార్జిగా నియమించిన గులాబీ పార్టీ భారీ మెజార్టీపై కన్నేసింది. సోదరుడు నరేందర్ రెడ్డి గెలుపు కోసం రేవంత్ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ స్థానిక నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. మదనపల్లి నుంచి ప్రచారాన్ని మొదలెట్టిన నరేందర్ రెడ్డి రోజుకు రెండు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. రేవంత్ ఇంకా ప్రచారం ప్రారంభించకపోయినా.. సోదరుడు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు పెరిగాయి.
రేవంత్‌కి మద్దతుగా కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్ గురునాథ్ రెడ్డి కుమారుడు జగదీశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఖరారు కాక ఆ పార్టీలో పెద్దగా హడావుడి కనిపించడం లేదు. కోల్పోయిన తాండూరు స్థానంతోపాటు ఓటర్ల తీర్పునకు తలవంచిన కొండంగల్ సహా వికారాబాద్, పరిగిలోనూ హవా చూపించాలని హస్తం పార్టీ భావిస్తుండగా.. అన్నిచోట్లా గులాబీ జెండా ఎగరేయాలని బీఆర్ఎస్ అభ్యర్థులు వ్యూహాల్లో నిమగ్నమయ్యారు.
Kishan Reddy Fires on BRS : "బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా.. యువత నిశ్శబ్ధయుద్దం చేస్తోంది"
Priyanka Gandhi Fires on BRS and BJP : 'బీఆర్ఎస్ ప్రభుత్వ రిమోట్ మోదీ చేతిలో ఉంది'