వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాకేత్‌నగర్‌లో బొమ్మ తుపాకీతో ఓ ప్రభుత్వాధికారి హల్చల్ చేశాడు. కలెక్టర్ కార్యాలయంలోని పౌరసరఫరాల శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహించే షేక్ ఫయాజ్ అహ్మద్ బొమ్మ తుపాకితో ఓ యువకున్ని బెదిరించాడు. కమలానగర్‌కు చెందిన ప్రణీత్... సాకేత్‌నగర్‌లోని పార్క్‌లో వాకింగ్ పూర్తి చేసుకోని వెళ్తుండగా... మూత్రవిసర్జన కోసం గౌలికార్ ఫంక్షన్‌హాల్ వెనుకభాగం వైపు వెళ్లాడు. కారులో అటువైపు వచ్చిన ఫయాజ్.. మద్యం మత్తులో తూలుతూ ప్రణీత్ దగ్గరికొచ్చాడు.
మహిళలు ఉండే ప్రదేశంలో మూత్రవిసర్జన ఎందుకు చేస్తున్నావని బూతులు తిట్టాడు. తన జేబులో ఉన్న తుపాకీని ప్రణిత్కి కనిపించేలా... భయటికి తీసి ఉంచాడు. ప్రణీత్ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోసాగాడు. అయినా విడిచిపెట్టకుండా... వెంట వెళ్తూ బూతులు తిట్టాడు. అక్కడి నుంచి తప్పించుకున్న ప్రణీత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఫయాజ్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇదే విధంగా తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.