వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చంద్రాయిన్పల్లిలో డెంగీవ్యాధి కోరలు చాచింది. గత వారం రోజుల్లో ఎనిమిది మంది దీని బారిన పడ్డారు. వీరిలో ఏడేళ్ల బాలిక మరణించగా మిగిలిన వారు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇలా బయట పడింది
వారం కిందట గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికకు జ్వరం వచ్చింది. సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించినా తగ్గలేదు. అక్కడ నుంచి నగరంలోని నీలోఫర్ దవాఖానాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. బాలిక మృతిలో గ్రామంలో అలజడి మొదలైంది. ఈ మహమ్మారి మరి కొంత మందికి వచ్చింది. త్వరితగతిన వారందరినీ నీలోఫర్‌కు తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ఎటుచూసినా అపరిశుభ్రం
గ్రామంలో ఎటు చూసినా అపరిశుభ్రానికి అడ్డాగా ఉంది. మురుగు నీరు ఏరులై పారుతోంది. పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్త ఎక్కడికక్కడే కుప్పలు తెప్పలుగా పేరుకు పోయింది.
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. డెంగీ మహమ్మారి మరికొంతమందిని బలిగొనక ముందే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: విషపు వలలో 'గిరి జనం'