ఓ వైపు పేదరికం.. మరోవైపు కుమారుని ఆనారోగ్యం... ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు దుబాయ్ వెళ్లింది వికారాబాద్‌కు చెందిన సమీరా. అవసరానికి తగిన నగదు సంపాదించి కుమారుని ఆరోగ్యం బాగు చేసుకోవాలనుకొంది ఆ మాతృమూర్తి. అక్కడే అనుకోని కష్టం వచ్చింది. యాజమానుల చిత్ర హింసలు భరించలేక బయటకు వచ్చి... స్వదేశం వచ్చేందుకు ప్రయత్నిస్తోందామె.
వికారాబాద్ జిల్లా కులకచెర్ల మండలానికి చెందిన సమీరా... మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కుమారుడు జన్మించిన కొన్ని రోజులకే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడాయన. అప్పటి నుంచి కష్టాలు పడుతూ వచ్చిందామె. చివరకు ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేందుకు దుబాయ్ వెళ్లడమే ఉత్తమమనుకుంది. తెలిసిన వాళ్ల ద్వారా దుబాయ్ వెళ్లింది. అక్కడకు వెళ్లాక మరిన్న హింసలు అనుభవించింది. సమీరా పాస్‌పోర్టు, విసా లాక్కున్న అక్కడి ఇంటి యాజమానులు ఇబ్బందులు పెట్టారు. చివరకు అక్కడ నుంచి ఎలాగోలాగ బయటపడి తెలిసిన వారి వద్ద తలదాచుకుంటోంది. భారతదేశానికి వచ్చేందుకు సహకరించాలని సామాజిక మాధ్యమాల ద్వారా అందరిని విజ్ఞప్తి చేస్తోంది.
సమీరాను స్వదేశానికి తీసుకువచ్చే స్తోమత లేదని... ప్రభుత్వమే చొరవ చూపాలని వేడుకుంటోంది ఆమె కుటుంబం.
ఇదీ చూడండి: క్రికెట్లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు