పీవీ కుటుంబంపై కేసీఆర్‌కు అభిమానం ఉంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఓడిపోయే స్థానంలో ఆమెను నిలబెట్టి వారి కుటుంబానికి అపకీర్తి తెస్తున్నారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీమంత్రి ప్రసాద్ ఇంట్లో ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు.
మూడు నెలల్లో లక్షా 95 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతి భవన్ ముందు ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరించారు. యువతను పెద్ద ఎత్తున సమీకరించి కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాడతానని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. యువతకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. 2015లో ఎన్జీవో నాయకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టి గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో తెరాస ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు పరోక్షంగా మద్దతిస్తోందని ఆరోపించారు. నామినేషన్ గడువు ముగుస్తుందనే రెండు రోజుల ముందు వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించి బలిపశువును చేశారని చిన్నారెడ్డి విమర్శించారు.