వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్‌పల్లి గ్రామం గ్రామానికి ఆనుకుని చిన్న వాగు, పెద్దవాగు రెండు ఉన్నాయి. ఒకవైపు గృహాలు ఉంటే.. మరోవైపు ఎనిమిది వందల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. దీంతో గ్రామస్తులకు నిత్యం వాగులు దాటే పరిస్థితి తప్పట్లేదు. వేసవికాలంలో పెద్దగా సమస్యలేమి లేవని... కానీ వర్షాకాలంలో వాగులు పొంగుతాయని గ్రామస్తులు తెలిపారు.
వర్షాకాలం మొదలైతే... రాకపోకలు నిలిచిపోతాయి. సుమారు 70 ఏళ్ల నుంచి వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులను అడిగినా... ప్రజాప్రతినిధులకు చెప్పినా... నిరాశే ఎదురైంది. ఈ సమస్యను ఎలా అయినా అధిగమించాలని స్థానికులంతా ఒక్కటయ్యారు. ముందుగా వెదురు బొంగులు, కట్టెలు, ఇనుపకడ్డీలు, బలమైన తాళ్లు, నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను సేకరించారు. వాగులపై తమకు వచ్చినట్టు, నచ్చినట్టు వంతెనను నిర్మించుకున్నారు. రూ.50 వేలు దీని ఖర్చు పెట్టారు. డబ్బు అవసరమైతే చందాల రూపంలో సర్దుబాటు చేసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఇంటికి ఒకరు, ఇద్దరు వచ్చి కష్టాన్ని పంచుకున్నారు. వారి ఐకమత్యంతో 70 ఏళ్ల సమస్యకు తాత్కాలిక పరిష్కారం దొరికింది.
ఇదీ చూడండి: Best tourist village : బెస్ట్ టూరిస్ట్ విలేజ్ కాంటెస్ట్‌లో.. భూదాన్ పోచంపల్లి