తెరాస పాలనలో అందమైన వికారాబాద్... వికారంగా తయారైందని భాజపా ఆరోపించింది. వికారాబాద్‌లో మాజీ మంత్రి చంద్రశేఖర్ భాజపాలో చేరేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. మాజీమంత్రి చంద్రశేఖర్‌కు... తరుణ్ చుగ్ కండువా కప్పి భాజపాలోకి ఆహ్వానించారు.
అధికారనే లక్ష్యంగా...
బండి సంజయ్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా భాజపా కార్యకర్తలు సిద్ధం కావాలని తరుణ్‌చుగ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో అవినీతి మాఫియా రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణను భ్రష్టు పట్టించారని ఆరోపించారు.
కేసీఆర్ రావణ లంకను ప్రతి భాజపా కార్యకర్త హనుమంతుడిలా మారి దహనం చేయాలి. తెరాస పాలనలో హామీలు అమలు కావడం లేదు. బంగారు తెలంగాణను వాయిదా వేశారు. బంగారు తెలంగాణను పక్కనపెట్టి బీమార్ తెలంగాణను చేశారు. ఈ బీమార్ తెలంగాణను బంగారు తెలంగాణ చేయడానికి ప్రతి కార్యకర్త పూనుకోవాలి.
తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి
హామీల ఊసేది?
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రాష్ట్రంలో ఇంతవరకు అమలు చేయడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లిస్తున్నారని ఆక్షేపించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం.. రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగికి రూ. 72 వేలు బాకీ పడ్డారని... అవి నిరుద్యోగుల ఖాతాల్లో వేసిన తర్వాతే జిల్లాలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
డీఎన్ఏ పరీక్షకు సిద్ధం...
రాష్ట్రంలో పోలీసుల ద్వారా భాజపాను అణగదొక్కాలని చూస్తున్న కేసీఆర్... తర్వాత జైలుకు వెళ్తారని మండిపడ్డారు. హిందువుగా నిరూపించుకునేందుకు తాను డీఎన్ఏ పరీక్షకు సిద్ధమని... నాగార్జునసాగర్ వేదికగా ఎవరు హిందువో తేల్చుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
తెరాస పాలనలో తెలంగాణ తల్లి బందీ అయ్యి ఘోషిస్తోందని... విముక్తి చేసి కమలం పార్టీకి పట్టం కట్టాలని భాజపా నేతలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే: కె. లక్ష్మణ్