వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం దామస్తపూర్(Damastapur)లో తాగునీటి సమస్యపై ప్రశ్నించినందుకు గ్రామస్థుడిపై దాడి చేసిన సర్పంచిపై బీసీ కమిషన్ విచారణ (BC Commission Inquiry) చేపట్టింది. గ్రామాన్ని సందర్శించిన బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ బాధితుడు శ్రీనివాస్‌ను పరామర్శించి వివరాలు సేకరించారు. కుటుంబసభ్యులు చెప్పిన విషయాలపై స్పందించిన శుభప్రద్... గ్రామంలోని రచ్చబండ వద్ద ప్రజల సమక్షంలో సర్పంచి జైపాల్‌రెడ్డిని విచారించారు.
శ్రీనివాస్‌పై దాడిని అంగీకరించిన జైపాల్‌రెడ్డి... బాధితుడి నివాసానికి వెళ్లి క్షమాపణలు కోరాడు. శ్రీనివాస్ కుటుంబానికి ఎలాంటి హాని చేయబోనని గ్రామస్థులందరి ముందు హామీ ఇచ్చారు. బాధితుడు శ్రీనివాస్ కుటుంబసభ్యులు పోలీసులపై బీసీ కమిషన్ సభ్యుల(BC Commission Members)కు ఫిర్యాదు చేశారు. జైపాల్‌రెడ్డిపై చేసిన ఫిర్యాదును పోలీసులు తప్పుగా రాసుకున్నారని వాపోయారు.
గ్రామంలోకి వచ్చి తమను విచారించకుండానే కేసును తప్పుదోవపట్టించారని ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులు మౌఖికంగా చెప్పిన విషయాలపై పోలీసులను ప్రశ్నిస్తామని బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ తెలిపారు.
ఇదీ జరిగింది...
గ్రామంలోని సమస్యలపైన ప్రశ్నించిన స్థానికునిపై ఊరి సర్పంచ్ పాశవికంగా దాడి చేశాడు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. దామస్తాపూర్ గ్రామంలో రెండు రోజుల క్రితం జరిగిన ఓ గొడవ గురించి పెట్టిన పంచాయితీకి సర్పంచ్ జైపాల్ రెడ్డి (Damastapur Sarpanch Jaipal reddy) హాజరయ్యాడు. అదే క్రమంలో.. ఊరిలో ఉన్న నీటి సమస్య ప్రస్తావన వచ్చింది. గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్.. పంచాయతీ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని ప్రస్తావించాడు. రెండు నెలలుగా నీళ్లు రాక ఇబ్బందులు పడుతుంటే.. ఏం చేస్తున్నారని.. ప్రశ్నించాడు. నీటి సమస్య, డ్రైనేజీ సమస్య మీద వెంటనే దృష్టి పెట్టాలని సర్పంచ్‌కు సూచించాడు.
కోపంతో ఊగిపోతూ...
అందరి ముందు నిలదీయటంతో కోపోద్రిక్తుడైన సర్పంచ్ జైపాల్‌రెడ్డి.. బూతుల దండకంతో వీరంగం సృష్టించాడు. దుర్భాషలాడుతూ.. కొట్టటం మొదలుపెట్టాడు. కిందపడేసి.. తన్నుతూ.. ముష్టిగుద్దులతో విరుచుకుపడ్డాడు. వెంటనే అక్కడున్న స్థానికులు.. సర్పంచ్‌ను నివారించి పక్కకు తీసుకెళ్లారు. సర్పంచ్ దాడితో కంగుతిన్న పిట్టల శ్రీనివాస్... గ్రామ సమస్యలను ప్రస్తావిస్తే... ఇలా దాడి చేస్తారా అని ఆందోళన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్ జైపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశాడు.
ఇదీ చూడండి: Live Video: సమస్యలపై ప్రశ్నించినందుకు స్థానికునిపై సర్పంచ్ దాష్టికం.. వీడియో వైరల్