Madanapalle Village Specialty : ఈ గ్రామం వికారాబాద్ జిల్లా బొమ్రాస్ పేట మండలం మదనపల్లె. ఈ గ్రామానికో ప్రత్యేకత ఉంది. ఈ ఊళ్లో ఎక్కువ మంది పేర్లు బాబు అనే పదంతో ముడిపడి ఉంటాయి. ఇంట్లో ఒక్కరి పేరైనా 'బా' అక్షరం కలిసేలా పెట్టుకుంటారు. ఈ గ్రామంలో 30 నుంచి 50 ఏళ్ల వయసున్న వాళ్లలో ఎక్కువ మందికి మగవాళ్లైతే బాబయ్య, ఆడవాళ్లైతే బాబమ్మ అని నామకరణం చేశారు.
'బా' మరువలేదు.. కాలం మారుతున్న కొద్దీ బాబయ్య పేరు పెట్టడం తగ్గించినా.. పేరులో 'బా' అనే అక్షరాన్ని మాత్రం ఆ ఊరు మరువ లేదు. పేరు ముందో, వెనకో బాబా అనో, బాబు అనో తగిలించుకుంటున్నారు. ఐతే దీనికి కులం, మతం అనే తేడా లేదు. ఏ కులమైనా, ఏ మతమైనా సరే బాబా పేరు పెట్టుకుంటారు.
బాబా పేరు కలిసొచ్చేలా.. ఈ ఊరి శివారులో బాబా సాహెబ్ దర్గా ఉంది. పురాతన మర్రి వృక్షం మధ్య ఈ దర్గా వెలసి ఉంది. దీనికి 200 ఏళ్ల చరిత్ర ఉందని పూర్వీకులు చెబుతుంటారు. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఈ దర్గాకు పేరుంది. సంతానం లేనివాళ్లు ఇక్కడ మొక్కుకుంటే వారికి పిల్లలు పుట్టేవారట. దీంతో పుట్టిన పిల్లలకు బాబా పేరు కలిసొచ్చేలా పేర్లు పెట్టేవారట.
"మా ఊరుకు ఓ స్పెషాలిటీ ఉంది. ఇక్కడ ఓ దర్గా ఉంది. అక్కడికి వెళ్లి ఏం మొక్కుకున్నా జరుగుతుంది. మొక్కు తీరిన తర్వాత కందూరు చేస్తారు. ముస్లింలు లేకపోయినా.. ఇక్కడున్న హిందువులే ఈ పూజలు చేస్తారు. ప్రతి వారం ఇక్కడ కందూరు చేస్తాం. సంవత్సరానికోసారి ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తాం. పిల్లల పుట్టకపోతే ఇక్కడ మొక్కుకున్న వాళ్లు చాలా మంది. ఇక్కడ మొక్కుకున్న చాలా మందికి సంతానం కలిగింది. వాళ్ల సంతానానికి వాళ్లు బాబా, బాబు అనే పేరు వచ్చేలా పేర్లు పెట్టుకుంటారు. మా ఊళ్లో ప్రతి ఒక్కరి పేరు వెనక బాబా అనో లేక బాబు అనో ఉంటుంది." - గ్రామస్థులు
బాబా.. పేరు ఫేమస్.. కోరిన కోర్కెలు తీరిన వాళ్లు సైతం బాబా పేర్లు పెట్టుకునేవారట. అలా బాబా పేరు లేని గడప అక్కడ ఉండదు. బాబాను కొలిచే వాళ్లకు కులం లేదు.... మతం లేదు. అన్నికులమతాల వాళ్లూ దర్గాను కొలుస్తారు. ఈ దర్గాకు హైదరాబాద్ సహా చుట్టుపక్కల 30 కిలోమీటర్ల నుంచి జనం వచ్చి వెళ్తుంటారు. కోర్కెలు తీరితే.. కందూరు చేసి మొక్కులు తీర్చుకుంటారు.
రెండేళ్ల కోసారి ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. ఈ గ్రామం నుంచే కాకుండా పక్కన జిల్లాల నుంచి కూడా ఈ దర్గాను దర్శించుకోవడానికి ప్రజలు తరలివస్తుంటారు. వారంలో ప్రతి రోజూ ఎవరో ఒకరు కందూరు చేస్తారు. పురాతన మర్రివృక్షం, మధ్యలో దర్గా... చుట్టుపక్కల ప్రాంతాలకు దర్శనీయ క్షేత్రంగా మారింది. ఈ క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.