సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాతర్లపహాడ్‌లో ఓ భర్త ఆడపిల్ల పుట్టిందనే నెపంతో తన భార్యను వదిలించుకునే ప్రయత్నం చేశాడు. దీనిపై అతని భార్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది. గ్రామానికి చెందిన అస్లాం నకిరేకల్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి 2014లో దేవరకొండకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలితో వివాహమైంది. ఆమె ప్రవర్తన బాగాలేదంటూ ఓ పాప పుట్టాక 2016 జనవరి నెలలో వక్ఫ్ బోర్డు నుంచి విడాకులు తీసుకున్నాడు. అనంతరం అదే ఏడాది నల్గొండకు చెందిన తబసుంను రెండో వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ అతనికి కుమార్తె పుట్టినప్పటి నుంచి వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఆడపిల్ల పుట్టిందనే సాకుతో అదనపు కట్నం కావాలని వేధిస్తూ తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ చేసినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. తనకు న్యాయం చేయాలని వారం రోజులుగా ఆమె భర్త ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంది.
ఇదీ చూడండి : వైద్యం వికటించి బాలుడి మృతి... ఆసుపత్రి ఎదుట ఆందోళన