సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన కూడలి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల శాఖ ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ముంబై మహానగరంలో జులై 7న బాబా సాహెబ్ అంబేడ్కర్ ఇంటి మీద (రాజ గృహంపై) కొందరు దుండగులు దాడి చేయడంపై మందకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
24 రోజులు గడిచినా...
24 రోజులు గడిచినప్పటికీ ఇంత వరకు మహారాష్ట్ర సర్కార్ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏ పార్టీ రాజకీయ నాయకులు స్పందించకపోవడం అత్యంత బాధాకరమని వాపోయారు. వెంటనే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేాశారు.
ప్రధానంగా ఐదు డిమాండ్లతో ఎమ్మార్పీఎస్ ఈ ధర్నా నిర్వహించింది.
1. రాజగృహంపై దాడి చేసిన నిందితులపై దేశ ద్రోహం కేసు పెట్టాలి.
2. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
3. ఈ సంఘటనపై సీబీఐ విచారణ జరపాలి
4. రాజగృహాన్ని అంబేడ్కర్ మెమోరియల్‌గా ప్రకటించాలి
5. అంబేడ్కర్ కుటుంబ సభ్యులకు అత్యున్నత స్థాయి రక్షణ కల్పించాలి.