సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ప్రభుత్వ అధికారులమంటూ, భూసమస్యలు పరిష్కరించడానికి కలెక్టరేట్ నుంచి వచ్చామని ముగ్గురు వ్యక్తులు గ్రామంలో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేలమర్రి గ్రామంలో గత కొంతకాలంగా దళితులకు మూడు ఎకరాల భూమి విషయంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి...దీన్ని ఆసరాగా తీసుకుని గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వాధికారులమంటూ.. గ్రామస్థులని నమ్మించే ప్రయత్నం చేశారు. వీఆర్వో వెంకన్నకు, వీఆర్ఏ నాగేశ్వరరావుకు ఫోన్ చేసి తక్షణమే భూమి వద్దకు రావాలని ఆదేశించారు. వీఆర్వో, వీఆర్ఏలు రాకముందే లాబీదారుల భూములలో బోర్డులు ఏర్పాటు చేశారు.
పని దినాల్లోనే ప్రభుత్వ ఉద్యోగులు సరిగ్గా పనిచేయరు. చుట్టూ తిప్పించుకుంటారు. అలాంటిది.. ఆదివారం నాడు వచ్చి హడావుడి చేయడం.. బోర్డులు ఏర్పాటు చేయడం గమనించిన గ్రామస్థులు వారి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. గుర్తింపుకార్డు చూపించాలని నిలదీశారు. గ్రామస్థులు అలా అడగడం ఊహించని నకిలీ అధికారులు ఖంగు తిన్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు అనడం విన్న నకిలీ అధికారులు అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానం వచ్చి వీఆర్వో, వీఆర్ఏలను సైతం ప్రజలు నిలదీశారు. వారెవరో తమకు తెలవదని వీఆర్వో, వీఆర్ఏలు చెప్పగా.. నకిలీ అధికారులు వీఆర్వో, వీఆర్ఏల పనే అని వాదిస్తున్నారు. గ్రామస్థులు అప్రమత్తమై గుర్తింపు కార్డులు అడగడం వల్ల నకిలీ అధికారుల ఆట కట్టించినట్టయింది.
ఇవీ చూడండి: శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు