హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తెరాస సత్తా చాటింది. ఆ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43,358 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ కంచు కోటలో పాగా వేశారు. ఫలితాల మొదటి రౌండ్ నుంచి అధిక్యంలో కొనసాగిన సైదిరెడ్డికి 1,13,094 ఓట్లు రాగా హస్తం అభ్యర్థి పద్మావతికి 69,736 ఓట్లు పోలయ్యాయి.
అన్నీతానై
తెరాస కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్.. అన్ని బాధ్యతలు తనపైనే వేసుకుని పార్టీని ముందుకు నడపించారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలోనూ ఇదే జోరు కొనసాగించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో పాటు రోడ్‌షోలో పాల్గొని తెరాస కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు.
సభ రద్దైనా
ఎన్నికకు రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి బహిరంగ సభ వర్షం కారణంగా రద్దైంది. దీన్ని విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశాయి. సభకు సీఎం ఉద్దేశపూర్వకంగానే రాలేదని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉపఎన్నిక ప్రచారంలో హోరెత్తించారు. ఈ ఆరోపణలు గులాబీ నేతలు సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సీపీఐ, తెరాసకు మద్దతు ఉపసంహరించుకుంది. తెరాస అభ్యర్థి భారీ విజయం సాధించడం వల్ల ఆ పార్టీ పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం తమకు టానిక్ లాంటిందని ఆ పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు అభివర్ణించారు.
హుజూర్‌నగర్‌కు కేసీఆర్
తమ అభ్యర్థిని గెలిపించినందుకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలపడానికి శనివారం హుజూర్‌నగర్ రానున్నారు. కృతజ్ఞత సభ పేరున జరుగుతున్న ఈ సభ కోసం తెరాస శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీచూడండి: హరీశ్‌రావు.. ఆర్టీసీ కార్మికుల కష్టాలు కనిపించడం లేదా..!: మందకృష్ణ